CPI Narayana: కేసీఆర్ ఒంటెద్దు పోకడలను విడనాడాలి: సీపీఐ నేత నారాయణ
- కేసీఆర్ రాజకీయ ఆత్మహత్యకు సిద్ధమయ్యారు
- టీఆర్ ఎస్ ప్రభుత్వంపై ఎన్ హెచ్ ఆర్ సీలో ఫిర్యాదు
- బంద్ కు మద్దతుగా ఢిల్లీలో తెలంగాణ భవన్ ను ముట్టడిస్తాం
ఆర్టీసీ కార్మికుల ఉద్యమానికి సకల జనుల సమ్మెరీతిలో అన్ని పార్టీలు తోడ్పడుతున్నాయని సీపీఐ సీనియర్ నాయకుడు కె.నారాయణ అన్నారు. ఆర్టీసీ కార్మికులది సెల్ఫ్ డిస్మిస్ కాదనీ, ముఖ్యమంత్రి కేసీఆరే రాజకీయ ఆత్మహత్యకు సిద్ధమయ్యారని విమర్శించారు. కేసీఆర్ ఇకనైనా ఒంటెద్దు పోకడలను విడనాడాలని అన్నారు.
కేసీఆర్ ప్రభుత్వంపై జాతీయ మానవహక్కుల సంఘానికి ఫిర్యాదు చేసిన సీపీఐ నేత అనంతరం మీడియాతో మాట్లాడారు. టీఎన్ జీవోలను తనవైపు తిప్పుకోవడానికి కేసీఆర్ ప్రయత్నించారని ఆరోపించారు. అర్టీసీ సమ్మె నేపథ్యంలో ఆరుగురు కార్మికులు బలయ్యారని, ఇంకెంతమంది చనిపోవాలని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో 1200 మంది ప్రాణాలర్పించారన్నారు. వారి బలిదానాల పునాదిపై కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారని విమర్శించారు.
కేసీఆర్ రెండోసారి సీఎం కావడానికి బీజేపీ సహకరించిందని... అనంతరం ఆ పార్టీకి చేయిచ్చారని నారాయణ పేర్కొన్నారు. రేపు చేపట్టనున్న రాష్ట్ర బంద్ లో భాగంగా తాము ఏఐటీయూసీ నేతృత్వంలో ఢిల్లీలో తెలంగాణ భవన్ ను ముట్టడిస్తామని తెలిపారు. అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలను ఒకేసారి నిర్వహిస్తే.. టీఆర్ ఎస్ రెండో దఫా అధికారంలోకి వచ్చేదికాదని అన్నారు.