New Delhi: ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్ కు ఆరు నెలల జైలుశిక్ష!
- ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్ రామ్ నివాస్ కు 6 నెలల జైలు శిక్ష
- 2015 నాటి కేసులో ఢిల్లీ హైకోర్టు తీర్పు
- ఈ వ్యవహారంతో కుదేలైన అధికార ఆమ్ ఆద్మీ పార్టీ
చట్టం ముందు అందరూ సమానులే అన్న విషయం మరోసారి రుజువైంది. 2015 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ముందు చోటుచేసుకున్న ఘటనలో నేరస్థుడిగా తేలిన ప్రస్తుత ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్ రామ్ నివాస్ గోయల్ కు ఆరు నెలల జైలు శిక్ష విధిస్తూ ఢిల్లీలోని ఓ కోర్టు తీర్పు చెప్పింది. అదే సమయంలో పదివేల రూపాయల పూచీకత్తుపై కోర్టు ఆయనకు బెయిల్ కూడా మంజూరు చేసింది.
ఎన్నికలకు ముందు గోయల్ అనుచరులు ఒక బిల్డర్ ఇంటిపై దాడి చేశారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఏడాది తర్వాత కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేశారు. ఈ దాడిలో రామ్ నివాస్, అతని అనుచరులు పాల్గొన్నట్లు పోలీసులు తమ ఛార్జిషీట్లో పేర్కొన్నారు. కోర్టు తీర్పుతో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ ఇరుకున పడ్డట్లే కన్పిస్తోంది. ప్రతిపక్షాల నేతలు అప్పుడే విమర్శలు కూడా ప్రారంభించారు.
ఇదిలావుంచితే, ఈ సందర్భంగా స్పీకర్ గోయల్ మాట్లాడుతూ, చట్టానికి తాను కట్టుబడి ఉంటానని, అయితే, దేనికీ భయపడనని, ఈ తీర్పును పైకోర్టులో అపీల్ చేస్తానని అన్నారు.