Jagan: జగన్ లో పేరుకుపోయిన అభద్రతాభావాలకు ఈ జీవోనే నిదర్శనం: నారా లోకేశ్
- జీవో 938 చెల్లుబాటు కాదన్న లోకేశ్
- అప్రజాస్వామికం అంటూ విమర్శలు
- లోకేశ్ వరుస ట్వీట్లు
టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ ఏపీలో మీడియా చానళ్ల అనధికార నిషేధంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. జీవో 938 ద్వారా ప్రభుత్వ అధికారులకు ఎవరిపైనైనా దావా వేసే అధికారం వస్తుందని, తమ శాఖలపై విమర్శనాత్మక కథనాలు ప్రచురించిన, ప్రసారం చేసిన ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియాపై చర్యలు తీసుకునే వీలుంటుందని నారా లోకేశ్ పేర్కొన్నారు. ఇది రాజ్యాంగపరంగా చెల్లుబాటు కాదని, పూర్తిగా అప్రజాస్వామిక జీవో అని స్పష్టం చేశారు. తన పరిపాలన పట్ల జగన్ లో బలంగా పేరుకుపోయిన అభద్రతాభావాలకు ఇది నిదర్శనం అని విమర్శించారు.
మొదట కొన్ని న్యూస్ చానళ్లను ప్రసారం చేయకుండా కేబుల్ నెట్ వర్కులపై నిషేధాజ్ఞలు విధించారని, ఓ విలేకరి హత్యకు గురవడంతో అధికారులకు పరువునష్టం దావాలు వేసే అధికారం కల్పిస్తూ ఆగమేఘాలపై ఆదేశాలు జారీచేశారని లోకేశ్ ఆరోపించారు. హత్యకు గురైన విలేకరిపై గతంలోనూ ఓసారి హత్యాయత్నం జరిగిందని తెలిపారు.
ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితులు అల్లకల్లోలంగా ఉన్నాయని, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఒకప్పుడు అగ్రగామిగా ఉన్న రాష్ట్రం నేడు ఈజ్ ఆఫ్ కిల్లింగ్ మీడియా అంశంలో బెస్ట్ గా నిలుస్తోందని వ్యంగ్యం ప్రదర్శించారు. ప్రమాణస్వీకారం అప్పుడే జగన్ న్యూస్ పేపర్లను, న్యూస్ చానళ్లను బెదిరించారని, ఇప్పుడది పరాకాష్టకు చేరిందని లోకేశ్ వరుస ట్వీట్లు చేశారు.