Telangana: తెలంగాణ వ్యాప్తంగా కొనసాగుతున్న ఆర్టీసీ బంద్.. కదలని బస్సులు.. కార్మికుల అరెస్ట్‌లు
- ప్రశాంతంగా కొనసాగుతున్న బంద్
- బంద్‌కు ప్రతిపక్షాలు, ప్రజా సంఘాల మద్దతు
- డిపోల నుంచి బయటకు రాని బస్సులు
తెలంగాణ ఆర్టీసీ కార్మికులు తలపెట్టిన రాష్ట్రవ్యాప్త బంద్ కొనసాగుతోంది. తమ డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె 15వ రోజుకు చేరుకోగా, నేడు కార్మిక సంఘాలు రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చాయి. బంద్‌కు ఆర్టీసీ జేఏసీ, ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు మద్దతు ప్రకటించాయి. బంద్ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా చాలా జిల్లాల్లో బస్సులు డిపోల నుంచి బయటకు రాలేదు. ఖమ్మం, మహబూబ్‌నగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, నల్గొండ తదితర జిల్లాల్లో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి.
మరోవైపు, ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా డిపోల వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బోధన్ డిపో వద్ద ఆందోళన చేస్తున్న కార్మికులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక, హైదరాబాద్‌లోనూ బంద్ కొనసాగుతోంది. నగరంలోని పలు డిపోల నుంచి బస్సులు బయటకు రాకుండా కార్మికులు అడ్డుకున్నారు. మొత్తంగా బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది.