KCR: హైకోర్టు ఆదేశాలను లైట్ తీసుకున్న కేసీఆర్.. ఆర్టీసీ కార్మికులతో చర్చలు లేనట్టే!
- అంతుచిక్కని కేసీఆర్ వైఖరి
- కోర్టు సూచించినా చర్చలకు పిలవని సీఎం
- మరో పది రోజుల వరకు ఇబ్బంది లేదన్న కేసీఆర్?
ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెను విరమింపజేసేందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు చేసిన సూచనను ముఖ్యమంత్రి కేసీఆర్ లైట్ తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ ఉదయం 10:30 గంటలకల్లా కార్మిక సంఘాలతో చర్చలు ప్రారంభించాలని కోర్టు సూచించగా, ప్రభుత్వం ఆ దిశగా నిర్ణయం తీసుకున్నట్టు కనిపించడం లేదు. నిజానికి కోర్టు సూచనతో శుక్రవారం రాత్రే కేసీఆర్ ఏదో ఒక నిర్ణయాన్ని ప్రకటిస్తారని అందరూ భావించారు. అయితే, ప్రకటన రాకపోవడంతో కేసీఆర్ ఆలోచన ఏమిటన్నది ఎవరికీ అంతుచిక్కడం లేదు.
కోర్టు సూచన తర్వాత ప్రగతి భవన్లో సమీక్షకు రావాలంటూ ఉన్నతాధికారులకు సీఎం కార్యాలయం నుంచి ఫోన్లు వెళ్లాయి. ఫోన్లు వచ్చిన మరుక్షణం రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మ, కమిషనర్ సందీప్ కుమార్ సుల్తానియా, ఆర్టీసీ ఉన్నతాధికారులు ప్రగతి భవన్‌కు చేరుకున్నారు. సీఎంవో సహాయ కార్యదర్శి రాజశేఖర రెడ్డితో సమావేశమయ్యారు. అయితే, అదే సమయంలో తాజ్‌కృష్ణలో జరిగిన మెదక్ ఎస్పీ చందన దీప్తి వివాహ రిసెప్షన్‌కు వెళ్లిన కేసీఆర్ తిరిగి వచ్చేసరికి రాత్రి 9 గంటలు దాటింది. దీంతో అధికారులతో మాట్లాడకుండానే ఆయన వెళ్లిపోయారు. అనంతరం సమీక్ష లేదన్న సమాచారంతో అధికారులు ప్రగతి భవన్ నుంచి వెళ్లిపోయారు.
ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపాలంటూ కోర్టు సూచన మాత్రమే చేసిందని, ఆదేశాలు కాదని, కాబట్టి అంత సీరియస్‌గా తీసుకోవాల్సిన పనిలేదని అధికారులతో కేసీఆర్ చెప్పినట్టు సమాచారం. అంతేకాక, విచారణను ఈ నెల 28 వరకు వాయిదా వేసిందని, కాబట్టి అప్పటి వరకు సమ్మెపై ఆలోచించకపోయినా పర్వాలేదని సీఎం చెప్పినట్టు తెలుస్తోంది. కోర్టు సూచనను కేసీఆర్ లైట్ తీసుకోవడం వల్లే ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలకు చర్చలకు సంబంధించిన ఆహ్వానం వెళ్లలేదని చెబుతున్నారు.