Tsrtc: ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించాక చర్చలేముంటాయి?: టీ-సర్కార్ పై విమలక్క ఆగ్రహం
- ప్రభుత్వం మాట్లాడే మాటలకు అర్థం ఉండాలి
- కార్మికులతో ముందుగా చర్చలు జరపాలి
- ఆ తర్వాతే సమ్మె విరమిస్తారు
ఆర్టీసీ కార్మికులు తమ సమ్మె విరమించిన తర్వాత చర్చలు జరుపుతామని తెలంగాణ ప్రభుత్వం చెప్పడం హాస్యాస్పదంగా ఉందని ‘అరుణోదయ’ కళాకారిణి విమలక్క అన్నారు. ఆర్టీసీ జేఏసీ ఈరోజు తలపెట్టిన బంద్ కు మద్దతుగా ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వద్ద చేపట్టిన నిరసన కార్యక్రమాల్లో ఆమె పాల్గొన్నారు.
ఈ సందర్భంగా విమలక్క మాట్లాడుతూ, సమ్మె విరమించాక చర్చలేముంటాయి? మాట్లాడే మాటలకు అర్థం ఉండాలని ప్రభుత్వంపై ఆమె నిప్పులు చెరిగారు. ముందుగా, చర్చలు జరిపితే, ఆ తర్వాత సమ్మె విరమిస్తారని, సమ్మె చేయడం కార్మికుల జన్మహక్కు అని అన్నారు. ఈ నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్న వాళ్లలో చాలా మంది మహిళలు ఉన్నారు, అదుపు చేసేందుకు వచ్చిన వారిలో మహిళా పోలీసులు లేకపోవడం దారుణమని విమర్శించారు.