TSRTC: తెలంగాణ ఆర్టీసీ జేఏసీ ఫిర్యాదుపై స్పందించిన జాతీయ బీసీ కమిషన్
- రాష్ట్ర ప్రభుత్వం కార్మికులను అణగదొక్కుతున్నదంటూ ఆర్టీసీ జేఏసీ ఫిర్యాదు
- సీఎస్, ఆర్టీసీ ఎండీకి నోటీసులు జారీ
- 25న వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశం
తెలంగాణలో ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో కార్మికుల ఫిర్యాదుపై జాతీయ బీసీ కమిషన్ స్పందించింది. ఆర్టీసీ జేఏసీ ఫిర్యాదు మేరకు కమిషన్ స్పందిస్తూ.. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆర్టీసీ ఎండీలకు నోటీసులు జారీచేసింది. రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, కార్మికులంతా సెల్ఫ్ డిస్మిస్ చేసుకున్నారని ప్రభుత్వం ప్రకటించిందని జేఏసీ తన ఫిర్యాదులో పేర్కొంది.
మరోవైపు ఆర్టీసీలో 20 వేలమందికి పైగా బీసీలు ఉన్నారని, వారంతా ప్రభుత్వ వైఖరి వల్ల తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని జేఏసీ నేతలు పేర్కొన్నారు. ఒక బీసీ కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడని తమ ఫిర్యాదులో వివరించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆర్టీసీ ఎండీలు ఈ నెల 25న వ్యక్తిగతంగా తమ ముందు హాజరు కావాలని కమిషన్ ఆదేశించింది.