Telangana: అవినీతి నేత కేసీఆర్ ను తొలగించే వరకూ ప్రజా తిరుగుబాటు తప్పదు: కాంగ్రెస్ నేత నాగం జనార్దన్ రెడ్డి
- సీఎం కుర్చీలో కూర్చొనే అర్హత కేసీఆర్ కు లేదు
- మేఘా కాంట్రాక్టు సంస్థ దోపిడీపై సమాధానం చెప్పాలి?
- ప్రాజెక్టుల నిర్మాణాల్లో భారీ అవినీతి జరిగింది
సీఎం కుర్చీలో కూర్చొనే అర్హత కేసీఆర్ కు లేదని కాంగ్రెస్ నేత నాగం జనార్దన్ రెడ్డి విమర్శించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, మేఘా కాంట్రాక్టు సంస్థ దోపిడీపై కేసీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టుల నిర్మాణాల్లో వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని, సబ్ కాంట్రాక్టుల్లో అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించారు. మూడు లక్షల కోట్ల అప్పులు చేసిన సీఎం, వాటిని ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా టీఎస్సార్టీసీ కార్మికుల సమ్మె గురించి ఆయన ప్రస్తావించారు. ఆర్టీసీకి ఇవ్వాల్సిన బకాయిలు చెల్లించలేదని, దోచుకున్న డబ్బును సీఎం వాపస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ‘సెల్ఫ్ డిస్మిస్’ అనే పదం లేదు, ఈ ముఖ్యమంత్రి సృష్టించిందే. కండక్టర్లను, డ్రైవర్లను పొట్టనబెట్టుకున్న ఈ ముఖ్యమంత్రికి వాళ్ల కుటుంబాల ఉసురు తగులుతుందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఆంధ్రా పాలకులు పోయేటప్పుడు ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను ఇప్పుడు అప్పుల రాష్ట్రంగా, గరీబ్ రాష్ట్రంగా కేసీఆర్ మార్చేశారని విమర్శించారు. ‘నీవు, నీ కాంట్రాక్టర్లు దోచుకున్న సొమ్ము వెనక్కి కట్టండి, లేదా, ప్రజలు నిన్ను బర్తరఫ్ చేస్తారు’ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ బిచ్చమెత్తుకునే పరిస్థితికి కేసీఆర్ తీసుకువస్తారని, ఈ అవినీతి నేతను తొలగించే వరకూ ప్రజా తిరుగుబాటు తప్పదని అన్నారు.