Puri Jagannadh: ప్రధాని మోదీకి బహిరంగ లేఖ రాసిన దర్శకుడు పూరీ జగన్నాథ్
- సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధంపై పూరీ స్పందన
- ఒక్కసారిగా మార్పు రాదని వెల్లడి
- మొక్కలను ఎక్కువగా నాటాలని సూచన
వాతావరణంలో విపరీతమైన మార్పులకు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఒక్కటే కారణం కాదని, అనేక ఇతర అంశాలు కూడా పర్యావరణాన్ని ప్రభావితం చేస్తున్నాయంటూ టాలీవుడ్ దర్శకుడు పూరీ జగన్నాథ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సోషల్ మీడియా ద్వారా ఓ లేఖ రాశారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను నిషేధిస్తే పర్యావరణంలో ఒక్కసారిగా మార్పు రాదని తెలిపారు.
ప్లాస్టిక్ ను నిషేధిస్తే అందరూ పేపర్ కవర్లు, పేపర్ సంచులను వాడడం మొదలుపెడతారని, దాంతో పేపర్ కు విపరీతమైన డిమాండ్ పెరిగిపోయి చెట్లను ఎక్కువగా నరికే పరిస్థితి వస్తుందని అన్నారు. చెట్ల నరికివేతతో పర్యావరణం సమతుల్యత దెబ్బతింటుందని అభిప్రాయపడ్డారు. ఇలాంటి సమస్యల నుంచి బయటపడాలంటే మొక్కలు ఎక్కువగా నాటాలని, ఒక్కసారి వాడిన ప్లాస్టిక్ ను పదేపదే వినియోగించేలా చర్యలు తీసుకోవాలన్నారు. తద్వారా ప్లాస్టిక్ ను ఎక్కడపడితే అక్కడ పడవేయడం తగ్గుతుందని పూరీ జగన్నాథ్ తన లేఖలో తెలిపారు. మొదట దీనిపై ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు.