Vijayawada: సైబర్ మోసగాడి వలకు చిక్కిన పోలీసు కానిస్టేబుల్.. ఖాతా నుంచి రూ.80 వేలు మాయం
- గూగుల్ పే ద్వారా రూ.10 వేలు చెల్లింపు
- బదిలీ జరగక పోవడంతో కస్టమర్ కేర్‌కి ఫోన్
- అంతే.. లైన్లోకి వచ్చి టోకరా ఇచ్చిన నేరగాడు
సైబర్ నేరగాళ్లకు అవకాశం వస్తే వారూ వీరూ అన్న తేడా ఉండదు. నిత్యం తమ కోసం వలవేసి పట్టుకునేందుకు ప్రయత్నించే పోలీస్ విభాగం కానిస్టేబుల్‌కే టోకరా ఇచ్చాడో కేటుగాడు. వివరాల్లోకి వెళితే... విజయవాడ భవానీపురం ఏకలవ్యనగర్‌కు చెందిన మజ్జి సురేష్ ఐఎస్‌డబ్ల్యూ విభాగంలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. నిన్న సాయంత్రం తన స్నేహితుడికి గూగుల్ పే ద్వారా రూ.10 వేలు పంపాడు. కాసేపటికి మిత్రుడుకి ఫోన్ చేసి డబ్బు పంపిన విషయం తెలియజేయగా అతను రాలేదని చెప్పాడు. దీంతో సురేష్ గూగుల్ పే కస్టమర్ కేర్ నంబర్‌కు ఫోన్‌చేసి విషయం చెప్పాడు.
అంతే.. కాసేపటికి ఓ సైబర్ నేరగాడు లైన్లోకి వచ్చాడు. మీరిచ్చిన ఫిర్యాదు పరిశీలించామని, ట్రాన్సాక్షన్ కన్ఫర్మ్ అయ్యేందుకు ఓ లింక్ పంపుతామని, దానిపై క్లిక్ చేసి ఐడీ నంబర్ చెప్పండని నమ్మబలికాడు. అతను గూగుల్ పే ఉద్యోగి అనుకుని సురేష్ అలాగే చేశాడు. అంతే.. కాసేపటికి అతని ఖాతా నుంచి రూ.80 వేలు డెబిట్ అయినట్టు మెసేజ్ వచ్చింది. దీంతో తాను మోసపోయానని భావించిన సురేష్ భవానీపురం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.