Kashmir: ఇకపై సియాచిన్ ప్రాంతంలోకి పర్యాటకులకు అనుమతి: మంత్రి రాజ్ నాథ్ సింగ్
- మరపురాని అనుభూతులను సొంతం చేసుకోవచ్చు
- సైనిక శిబిరాలను సందర్శించవచ్చు
- 370 అధికరణ రద్దు చేశాం..ఇక నిర్భీతితో పర్యటించవచ్చు
జమ్ము, కశ్మీర్ లో పర్యాటక రంగం అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి వుందని మోదీ సర్కారు ప్రకటించింది. సియాచిన్ ప్రాంతంలోకి పర్యాటకులను అనుమతించాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందని రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ‘లడఖ్ ను పర్యాటక క్షేత్రంగా తీర్చదిద్దడానికి అవకాశాలున్నాయి. సియాచిన్ బేస్ క్యాంప్ నుంచి కుమార్ పోస్టు వరకు ప్రాంతాలను ఇక నుంచి పర్యాటకులు సందర్శించవచ్చు’ అని అన్నారు.
రాష్ట్రంలో 370 అధికరణ రద్దుతో పర్యాటకులు స్వేచ్ఛగా పర్యటించడానికి వీలుకలిగిందని చెప్పారు. సియాచిన్ ప్రాంతంలో అంతకు ముందు ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రతికూల పరిస్థితులు ఉండేవని, ప్రస్తుతం ఆ భయం ఉండదని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. సియాచిన్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధ క్షేత్రంగా పేరుపొందింది. ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో పర్యాటకులు ఈ ప్రాంతంలో పర్యటిస్తూ.. మరపురాని అనుభూతులను సొంతం చేసుకోవచ్చని ఆయన అన్నారు.