Karimnagar District: పలు ప్రాంతాల్లో టీఎస్ ఆర్టీసీ కార్మికులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
- అఖిల పక్షం వంటా వార్పునకు పిలుపు
- కాచిగూడలో డిపో ఎదుట ఆర్టీసీ కార్మికుల నిరసన
- కరీంనగర్ లో ఉద్రిక్తత
తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె 18వ రోజు కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా పలు డిపోల ముందు కార్మికులు నిరసనలు తెలుపుతున్నారు. అఖిల పక్షం వంటా వార్పునకు పిలుపు నిచ్చిన నేపథ్యంలో పలు ప్రాంతాల్లో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. సికింద్రాబాద్లోని జేబీఎస్ వద్ద వంటావార్పు నిర్వహించారు. కాచిగూడలో డిపో ఎదుట ఆర్టీసీ కార్మికులు... తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్ల మద్దతును కోరారు. డిపో ఎదుట నిరసనకు దిగారు. దీంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కరీంనగర్ లో ఆర్టీసీ కార్మికుల సమ్మె ఉద్రిక్తతలకు దారితీసింది. ఈ రోజు తెల్లవారు జామున కరీంనగర్ బస్ స్టేషన్ వద్ద పార్కింగ్ స్థలంలో ఉన్న ఆర్టీసీ అద్దె బస్సుపై గుర్తుతెలియని వ్యక్తి రాయి విసిరాడు. దీంతో అద్దం ధ్వంసమైంది. సమ్మెకు సహకరించాలని తాత్కాలిక డ్రైవర్లను కార్మికులు కోరారు. బస్సులను అడ్డుకున్న జేఏసీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతుండడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.