Skymet: గత 24 గంటల్లో నెల్లూరులో అత్యధిక వర్షపాతం
- బంగాళాఖాతంలో అల్పపీడనం
- అక్టోబరు 24 వరకు వర్షాలు కురుస్తాయని స్కైమెట్ వెల్లడి
- కోస్తా ప్రాంతాలకు భారీ వర్ష సూచన
బంగాళాఖాతంలో అల్పపీడనం, ఈశాన్య రుతుపవనాల కారణంగా ఏపీలో అనేక ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం, దానికి అనుబంధంగా ఆవర్తనం కొనసాగుతుండగా, ఈశాన్య రుతుపవనాలు కూడా క్రియాశీలకంగా మారాయి. దాంతో ఏపీ కోస్తా జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గత 24 గంటల్లో నెల్లూరులో అత్యధికంగా 98.9 మిమీ వర్షపాతం నమోదైంది. ఒంగోలులో 67.2, కాకినాడలో 50, మచిలీపట్నంలో 43.8, విశాఖపట్నంలో 26.8 మిమీ వర్షం కురిసింది.
అల్పపీడన ప్రభావంతో అక్టోబరు 24 వరకు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని ప్రైవేటు వాతావరణ సంస్థ స్కైమెట్ పేర్కొంది. రానున్న రెండుమూడు రోజుల్లో నెల్లూరు, కావలి, ఒంగోలు, బాపట్ల, మచిలీపట్నం, కాకినాడ, విశాఖపట్నం ప్రాంతాల్లో భారీ వర్షాలు పడతాయని స్కైమెట్ తెలిపింది.