Hyderabad: ఘరానా మోసగాడు శ్రీనివాసరావు అరెస్ట్... 12 జిల్లాల పోలీసులకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్!

  • 150 మంది నుంచి పెద్దమొత్తంలో వసూలు చేసినట్టు ఆరోపణలు
  • ఎంటెక్ చదివిన శ్రీనివాసరావు
  • డబ్బు కోసం అడ్డదారులు

గత కొంతకాలంగా 12 జిల్లాల పోలీసులను ముప్పుతిప్పలు పెడుతున్న ఘరానా మోసగాడు శ్రీనివాసరావు ఎట్టకేలకు అరెస్ట్ అయ్యాడు. హైదరాబాద్ లో అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 12 మొబైల్ ఫోన్లు, 29 సిమ్ కార్డులు, ఒక ల్యాప్ టాప్ స్వాధీనం చేసుకున్నారు. పత్రికల్లో ఉద్యోగాలు, రుణాల పేరిట ప్రకటనలు ఇచ్చి అమాయకులను మోసగించడంలో శ్రీనివాసరావు దిట్ట. శ్రీనివాసరావు 150 మంది నుంచి భారీ మొత్తంలో వసూలు చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. గతంలో మ్యాట్రిమొనీ సైట్ తో మోసగించిన కేసులో అరెస్ట్ అయ్యాడు.

శ్రీనివాసరావు స్వస్థలం తూర్పుగోదావరి జిల్లా తొండంగి. ఎంటెక్ చదివాడు. సులువుగా డబ్బు సంపాదించడం కోసం అడ్డదారులు తొక్కాడు. అతడిపై ఇప్పటివరకు 20 కేసులున్నాయి. సాధారణ పోలీసులతో పాటు సీఐడీ, సైబర్ క్రైమ్ పోలీసులు కూడా కొంతకాలంగా శ్రీనివాసరావు కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. 600 సీసీటీవీ కెమెరాల ఫుటేజ్ ను జల్లెడ పట్టి పక్కా స్కెచ్ తో అతడిని పట్టుకున్నారు.

  • Loading...

More Telugu News