cpi: అది కేసీఆర్ సొంత చట్టం!: సీపీఐ నేత నారాయణ
- ‘సెల్ఫ్ డిస్మిస్’ అనేది ఏ చట్టంలో లేదు
- ఆర్టీసీ కార్మికుల సమ్మె చట్ట విరుద్ధం కాదు
- ఇవ్వాల్సిన రాయితీలు ఇస్తే ఆర్టీసీకి నష్టాలు రావు
సమ్మె చేస్తున్న టీఎస్సార్టీసీ కార్మికులు సెల్ఫ్ డిస్మిస్ చేసుకున్నారంటూ సీఎం కేసీఆర్ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై సీపీఐ నేత నారాయణ మండిపడ్డారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘సెల్ఫ్ డిస్మిస్’ అనేది ఏ చట్టంలో లేదని, అది కేసీఆర్ సొంత చట్టం అని విమర్శించారు.
ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె చట్ట విరుద్ధం కాదని, యాక్ట్ ప్రకారం నోటీస్ ఇచ్చారని గుర్తుచేశారు. నష్టాలు వచ్చే రూట్లను ఆర్టీసీకి ఇచ్చి, లాభాలు వచ్చే రూట్లను ప్రైవేట్ వారికి అప్పగించారని మండిపడ్డారు. ఆర్టీసీకి ఇవ్వాల్సిన రాయితీలు ఇస్తే నష్టాలు వచ్చేవి కావని, ఆర్టీసీని విడతల వారీగా ప్రైవేట్ పరం చేసేందుకు కేసీఆర్ పథకం పన్నారని ఆరోపించారు.
కాగా, ఆర్టీసీ కార్మికుల సమ్మె 18 రోజులకు చేరింది. జూబ్లీ బస్ స్టేషన్ వద్ద ఆర్టీసీ జేఏసీ నేతలు, ప్రతిపక్ష పార్టీలకు చెందిన పలువురు నేతలు తమ నిరసన వ్యక్తం చేశారు. వంటా-వార్పు, ఆటపాటలతో ప్రభుత్వం తీరును దుయ్యబట్టారు.