Bharth ki laxmi: ‘భారత్ కీ లక్ష్మి’ బ్రాండ్ అంబాసిడర్లుగా పీవీ సింధు, దీపిక పదుకోనే
- మహిళల విజయాలకు గుర్తింపు లభిస్తే దేశం పురోగమిస్తుంది
- వారిని అభినందిస్తూ ఈ దీపావళి జరుపుకుందాం
- వీడియో ద్వారా దీపిక, సింధు పిలుపు
భారత ప్రధాని నరేంద్రమోదీ ఇటీవల ‘మన్ కీ బాత్’లో ప్రకటించిన ‘భారత్ కీ లక్ష్మి’ ఉద్యమానికి బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు, బాలీవుడ్ నటి దీపిక పదుకొనేలు బ్రాండ్ అంబాసిడర్లుగా నియమితులయ్యారు. మహిళలు సాధించిన విజయాలకు సరైన గుర్తింపు లభించినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందని, అలాంటి మహిళల విజయాలను అభినందిస్తూ ఈ దీపావళిని జరుపుకుందామని పిలుపునిస్తూ వీరిద్దరూ కలిసి నటించిన వీడియోను ప్రధాని నరేంద్రమోదీ నిన్న తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు.
ఈ వీడియోలో సింధు, దీపికలు తాము సాధించిన విజయాల గురించి చెబుతూ మహిళా సాధికారత గురించి మాట్లాడారు. సాధారణ జీవితంలో అనేక సవాళ్లు ఎదురైనప్పటికీ లక్ష్యమే మనల్ని ముందుకు నడిపిస్తుందని అన్నారు. ఇంట్లో ఆడపిల్ల ఉంటే సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయని, అలాగే మహిళలు సాధించిన విజయాలు దేశానికి గర్వకారణంగా నిలుస్తాయని దీపిక, సింధులు చెప్పుకొచ్చారు. అలాగే, మీకు తెలిసిన మహిళల విజయాలను ‘భారత్‌కీలక్ష్మి’ హ్యాష్‌ట్యాగ్‌తో సోషల్ మీడియాలో పంచుకోవాలని పిలుపునిచ్చారు. ఈ వీడియో ద్వారా ‘భారత్ కీ లక్ష్మీ’ సందేశాన్ని సింధు, దీపికలు అద్భుతంగా తెలియజేశారని మోదీ ప్రశంసించారు.