Chandrababu: జగన్, చంద్రబాబు రాయలసీమలో పుట్టడం దౌర్భాగ్యం: బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి
- వీరిద్దరూ రాయలసీమకు ఏం చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలి
- సీమ హక్కుల సాధనలో బీజేపీకి చిత్తశుద్ధి ఉంది
- నరేగా నిధులతో గ్రామ సచివాలయాలకు వైసీపీ రంగులు వేస్తున్నారు
ఏపీ సీఎం జగన్, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబులపై రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వీరిద్దరూ రాయలసీమకు ఏం చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జగన్, చంద్రబాబు రాయలసీమలో పుట్టడం దౌర్భాగ్యమని అన్నారు.
రాయలసీమలో బీజేపీకి ఒక్క సీటు రాకపోయినా... రాయలసీమ హక్కుల సాధనలో తమ పార్టీకి చిత్తశుద్ధి ఉందని చెప్పారు. సీమ అభివృద్ధి కోసం ఈ ప్రాంతానికి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. గ్రామ సచివాలయానికి 'నరేగా' నిధులతో వైసీపీ రంగులు వేస్తున్నారని మండిపడ్డారు.
మరోవైపు, విష్ణువర్ధన్ రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. కర్నూలులో ఆయన నిర్వహించిన ప్రెస్ మీట్ ను విద్యార్థి సంఘాలు అడ్డుకున్నాయి. రాయలసీమ డిక్లరేషన్ పై బీజేపీ వైఖరిని స్పష్టం చేయాలని డిమాండ్ చేశాయి. డిక్లరేషన్ పై రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒత్తిడి చేయడం లేదని మండిపడ్డాయి.