Pakistan: మా నాన్నపై విషప్రయోగం జరిగింది: నవాజ్ షరీఫ్ కుమారుడి ఆరోపణ
- విషప్రయోగం వల్లే మా తండ్రి ఆరోగ్యం దెబ్బతింది
- ప్లేట్ లెట్ల సంఖ్య 16 వేలకు పడిపోయింది
- ఆయన ప్రమాదకర స్థితిలో ఉన్నారని వైద్యులు తెలిపారు
పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కుమారుడు హుస్సేన్ తీవ్ర ఆరోపణలు చేశారు. తన తండ్రిపై విషప్రయోగం చేశారని... అందువల్లే ఆయన ఆరోగ్యం దెబ్బతిందని చెప్పారు. దీనిపై ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. విషప్రయోగం జరగడం వల్ల ఆయన ప్లేట్ లెట్ల సంఖ్య 16,000కు పడిపోయిందని తెలిపారు. తన తండ్రి ప్రమాదకర స్థితిలో ఉన్నారని వైద్యులు చెప్పారని వెల్లడించారు. అనారోగ్యానికి గురైన ఆయనను సరైన సమయంలో ఆసుపత్రికి ఎందుకు తరలించలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
వివిధ కేసుల్లో దోషిగా తేలిన షరీఫ్ ప్రస్తుతం జైలు శిక్షను అనుభవిస్తున్నారు. తీవ్ర అస్వస్థతకు గురైన ఆయనను లాహోర్ లోని 'ది సర్వీస్' ఆసుపత్రిలో చేర్చారు. ప్రస్తుతం ఆ ఆసుపత్రినే జైలుగా మార్చేశారు. మరోవైపు, షరీఫ్ ఆరోగ్యం నిలకడగా ఉందని, చికిత్సకు ఆయన స్పందిస్తున్నారని వైద్యులు తెలిపారు.