London: ఫ్రీజర్‌లో దాక్కున్న 39 మంది మృతి.. బ్రిటన్‌లో కలకలం రేపిన మృతదేహాల ట్రక్కు
- వేల్స్‌లోని హోలీహెడ్ రేవు గుండా బ్రిటన్‌లోకి ట్రక్కు ప్రవేశం
- మృతులు బల్గేరియా వాసులుగా గుర్తింపు
- అక్రమ చొరబాటు కోసం ఫ్రీజర్‌లో దాక్కోవడంతో మృతి
బల్గేరియా నుంచి వచ్చిన ఓ ట్రక్కులో 39 మృతదేహాలు బయటపడిన ఘటన లండన్‌లో జరిగింది. గ్రేస్ ఏరియా ఆఫ్ ఎసెక్స్ సమీపంలోని ఇండస్ట్రియల్ పార్క్ వద్ద ట్రక్కును స్వాధీనం చేసుకున్న పోలీసులు అందులోని మృతదేహాలను చూసి విస్తుపోయారు. వేల్స్‌లోని హోలీహెడ్ రేవు గుండా ఈ ట్రక్ శనివారం లండన్‌లో ప్రవేశించినట్టు పోలీసులు గుర్తించారు. ట్రక్కులోని మృతదేహాలు ఎవరివి? వారెలా మృతి చెందారు? అన్న విషయాలపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నార్త్ ఐర్లండ్‌కు చెందిన ట్రక్కు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.
ట్రక్కు వెనకభాగంలో మైనస్ 25 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతతో ఉన్న ఫ్రీజర్ ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. బల్గేరియా నుంచి అక్రమంగా బ్రిటన్‌లోకి వచ్చే క్రమంలో ఫ్రీజర్‌లో దాక్కోవడం వల్ల వారంతా మృతి చెంది ఉండొచ్చని అనుమానిస్తున్నారు. కాగా, 2000వ సంవత్సరంలోనూ బ్రిటన్‌లోకి ఇలానే అక్రమంగా ప్రవేశించే క్రమంలో 58 మంది చైనీయులు మృత్యువాత పడ్డారు.