MAA: 'మా'లొల్లి... నరేశ్ పై ఘాటుగా స్పందించిన జీవిత!
- అసోసియేషన్ మీటింగులు సక్రమంగా లేవు
- 18 మంది ఓ వైపు, 8 మంది మరోవైపు
- నరేశ్ ఏది చెబితే అది చేయాలా?
- సంతకాలు పెట్టేసి వచ్చే రకం కాదన్న జీవిత
తనకు సమాచారం ఇవ్వకుండా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) సమావేశం కావడంపై అధ్యక్ష బాధ్యతల్లో ఉన్న నటుడు నరేశ్ ఆగ్రహం వ్యక్తం చేయగా, జనరల్ సెక్రటరీ జీవిత సైతం అంతే ఘాటుగా స్పందించారు. వైస్ ప్రెసిడెంట్ హేమ, ఈసీ మెంబర్ జయలక్ష్మితో కలిసి మీడియాతో మాట్లాడిన ఆమె, మన సమస్యల గురించి మన మధ్యలో మాత్రమే మాట్లాడుకోవాలి తప్ప బయట పడటం ఏంటని అన్నారు. 950 మంది సభ్యులున్న అసోసియేషన్ లో 26 మందిని ఎన్నుకోవడం జరిగిందని గుర్తు చేసిన జీవిత, 18 మంది ఓ వైపు, మిగతా 8 మంది మరోవైపున్నారని, ఆ 8 మందిలోనే అధ్యక్షుడు నరేశ్ ఉన్నారని చెప్పారు.
అధ్యక్షుడైనంత మాత్రాన, తమను సంప్రదించకుండా నిర్ణయాలు తీసుకుంటే, తాము 'తానా... తందాన' అనబోమని వ్యాఖ్యానించారు. తనకు తోచినప్పుడు ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం పెట్టి, తానేం చేయాలనుకుంటున్నదీ చెప్పేసి వెళ్లిపోతే ఎలాగని ప్రశ్నించారు. ఎవరైనా ప్రశ్నిస్తే, వారికేమీ తెలియదని నరేశ్ అంటుంటారని, తామంతా సంతకాలు పెట్టేసి రావడానికే కమిటీ మీటింగ్ కు వెళుతున్నట్టుందని అన్నారు.
నరేశ్ చెప్పినట్టుగా మూడు ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశాలు విజయవంతంగా సాగలేదని, తామెవరమూ సమావేశాల్లో సంతోషంగా లేమని అన్నారు. అసోసియేషన్ లో ఏదీ సక్రమంగా జరగడం లేదని జీవిత ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.