MSK Prasad: ధోనీ టి20 వరల్డ్ కప్ అవకాశాలపై మరింత స్పష్టతనిచ్చిన ఎమ్మెస్కే ప్రసాద్
- చరమాంకంలో ధోనీ కెరీర్
- రిటైర్మెంటుపై నిర్ణయం తీసుకోని ధోనీ
- యువ ఆటగాళ్లకే తమ ప్రోత్సాహం అంటున్న సెలెక్టర్లు
వికెట్ కీపింగ్ దిగ్గజం మహేంద్ర సింగ్ ధోనీ క్రికెట్ కెరీర్ చరమాంకానికి చేరింది. ధోనీ భవితవ్యంపై సెలెక్టర్లతో మాట్లాడతానని బీసీసీఐ కొత్త అధ్యక్షుడు గంగూలీ సైతం వెల్లడించాడు. ఈ నేపథ్యంలో టీమిండియా చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ మరింత స్పష్టతనిచ్చాడు. వచ్చే ఏడాది జరిగే టి20 వరల్డ్ కప్ కు టీమిండియా ఎంపిక విషయంలో తాము చాలా స్పష్టమైన ఆలోచనలతో ఉన్నామని వెల్లడించాడు.
"రిషబ్ పంత్ ను ప్రోత్సహించడానికే మా ప్రాధాన్యత. ఇప్పటికే అతనికి తగినన్ని అవకాశాలు కల్పించడం ప్రారంభించాం. తన అత్యుత్తమ ఆటతీరు ప్రదర్శించాల్సి ఉన్నా మా భవిష్యత్ ప్రణాళికల్లో పంతే ఉన్నాడు. వరల్డ్ కప్ లో యువ అంశానికే పెద్ద పీట వేయాలనుకుంటున్నాం. యువ ఆటగాళ్లను ప్రోత్సహించే విషయంలో మా పంథా ఏంటనేది ధోనీకి వివరిస్తాం. ధోనీ కూడా సానుకూలంగా స్పందిస్తాడని ఆశిస్తున్నాం" అంటూ ఎమ్మెస్కే వివరణ ఇచ్చాడు.
కాగా, ఇంగ్లాండ్ వేదికగా జరిగిన వన్డే వరల్డ్ కప్ ముగిసిన వెంటనే టీమిండియా వెస్టిండీస్ పర్యటనకు వెళ్లగా ధోనీ కశ్మీర్ లో భద్రతా విధులు నిర్వర్తించేందుకు వెళ్లాడు. ఆ తర్వాత టీమిండియాకు మళ్లీ ఎంపిక చేస్తారని భావించినా సెలెక్టర్లు మాత్రం ధోనీని పట్టించుకోలేదు. తాజాగా బంగ్లాదేశ్ తో టి20 సిరీస్ కు కూడా రిషబ్ పంత్, సంజూ శాంసన్ వంటి యువ వికెట్ కీపర్ల వైపే మొగ్గుచూపారు.