BCCI: మా పరిస్థితులేంటో గంగూలీకి తెలుసు: కోహ్లీ
- గంగూలీని త్వరలో కలుస్తా
- దాదాతో చర్చల కోసం ఎదురు చూస్తున్నా
- భారత క్రికెట్ ను అత్యున్నత స్థాయికి తీసుకుపోవడంపై చర్చ
బీసీసీఐ కొత్త అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన సౌరవ్ గంగూలీతో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ త్వరలో భేటీ కానున్నాడు. గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడిగా నిన్న బాధ్యతలు చేపట్టిన అనంతరం వ్యాఖ్యానిస్తూ.. కోహ్లీ పనులు తేలిక చేయడానికి ప్రయత్నిస్తానన్న విషయం తెలిసిందే. అంతకు ముందు భారత జట్టును కోహ్లీ అద్భుతంగా నడిపిస్తున్నప్పటికీ ఐసీసీ ట్రోఫీలు గెలవాల్సిన అవసరముందని గంగూలీ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో వీరిద్దరి భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.
కోహ్లీ ఈరోజు మీడియాతో మాట్లాడుతూ, గంగూలీతో వృత్తిపరమైన చర్చల కోసం ఎదురు చూస్తున్నానని తెలిపాడు. భారత క్రికెట్ ను అత్యున్నత స్థాయికి తీసుకుపోవడంపై తాము చర్చిస్తామన్నాడు. ‘నేను గంగూలీని త్వరలో కలుస్తా, అతనితో చర్చల కోసం ఎదురుచూస్తున్నా. గతంలో దాదాతో చాలాసార్లు సంభాషించా. ఇప్పుడు మళ్లీ ఆయనతో భేటీ కానున్నా. గతంలో ఆయన క్రికెట్ ఆడారు. మా పరిస్థితులేంటో తెలుసు. భారత క్రికెట్ అవసరాలు, జట్టు ఆవశ్యకతలు తెలుసు. వృత్తిపరమైన అత్యున్నత చర్చలు అవసరం’ అని కోహ్లీ అన్నాడు.