Kashmir: కశ్మీర్ లోయలో ఉగ్రవాదుల ఘాతుకం.. ఇద్దరు ట్రక్ డ్రైవర్ల కాల్చివేత!
- ఆపిల్స్ రవాణా చేయడానికి వచ్చిన డ్రైవర్లు
- ట్రక్ కు నిప్పు, మరొక డ్రైవర్ కు గాయాలు
- వరుస ఘటనలతో ఆపిల్స్ వ్యాపారస్తుల్లో భయాందోళనలు
కశ్మీర్ లోయలో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. ఈరోజు సాయంత్రం ఆపిల్స్ ను రవాణా చేయడానికి షోపియాన్ కు వచ్చిన ఇద్దరు ట్రక్ డ్రైవర్లను ఉగ్రవాదులు కాల్చివేశారు. అనంతరం వారి ట్రక్ కు నిప్పు పెట్టారు. ఈ దాడిలో మరో ట్రక్ డ్రైవర్ కూడా గాయపడ్డాడు.
వారం క్రితం ఇదే జిల్లాలో ఓ ఆపిల్ పండ్ల వ్యాపారిని ఉగ్రవాదులు చంపిన విషయం తెలిసిందే. బుధవారం, రాజస్థాన్ కు చెందిన ఓ డ్రైవర్ పూల లోడుతో షోపియాన్లోని మారుమూల ప్రాంతానికి వెళుతున్న సమయంలో అతన్ని ఉగ్రవాదులు చంపివేశారు. అంతేకాక మరో ఇటుకలు తయారు చేసే కార్మికుడిని కూడా ఉగ్రవాదులు పొట్టన పెట్టుకున్నారు.
డ్రైవర్లు ముందస్తుగా భద్రతా బలగాలకు తెలియజేయకుండా మారుమూల ప్రాంతాల్లోకి వెళుతున్నారని స్థానిక సీనియర్ పోలీసు అధికారులు మీడియాకు తెలిపారు. మృతుల్లో ఒకరు రాజస్థాన్ కు చెందిన అల్వార్ నివాసి మహ్మద్ ఇలియాస్ గా గుర్తించగా, గాయపడిన వ్యక్తి పంజాబ్ లోని హోషియార్ పూర్ కు చెందినవాడిగా పోలీసులు నిర్ధారించారు.
ఇతర ప్రాంతాల నుంచి వ్యాపారం కోసం లోయలోకి ప్రవేశించిన వారిని ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకుంటున్నారని, ఆ విధంగా కశ్మీర్ లో వ్యాపారాన్ని అస్థిరపర్చాలన్నదే వారి వ్యూహంగా కన్పిస్తోందని పోలీసులు తెలుపుతున్నారు. వరుస ఘటనలతో స్థానిక ఆపిల్స్ వ్యాపారస్తుల్లో భయాందోళనలు నెలకొన్నాయి.