APIIC: ఏపీఐఐసీ లేఖపై హైకోర్టును ఆశ్రయించిన కేపీఐపీఎల్
- 2007లో కేపీఐపీఎల్కు 6,284 ఎకరాలు ఇవ్వాలని ఏపీఐఐసీ నిర్ణయం
- 2008లో 4,731.15 ఎకరాల భూమి కొనుగోలు
- తాజాగా ఆ ఒప్పందాన్ని రద్దు చేస్తున్నట్టు లేఖ రాసిన ఏపీఐఐసీ
గతంలో తమకు కేటాయించిన భూములను వెనక్కి తీసుకుంటున్నట్టు ఏపీఐఐసీ రాసిన లేఖపై కృష్ణపట్నం ఇన్ఫ్రాటెక్ ప్రైవేట్ లిమిటెడ్ (కేపీఐపీఎల్) హైకోర్టును ఆశ్రయించింది. ఏపీఐఐసీ లేఖను రద్దు చేసి తమ హక్కుల్ని కొనసాగించాలని కోర్టును కోరింది. ఈ మేరకు కేపీఐపీఎల్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సీఎఫ్వో) కె.గౌరి పిటిషన్ దాఖలు చేశారు.
ఆ భూముల విషయంలో ప్రతివాదులు జోక్యం చేసుకోకుండా అడ్డుకోవాలని, వాటిపై తమకున్న హక్కుల్ని కొనసాగించేలా ఆదేశాలు జారీ చేయాలని కోర్టును అభ్యర్థించారు. కోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో ఏపీఐఐసీ, ఆ సంస్థ నెల్లూరు జోనల్ మేనేజర్, రాష్ట్ర పరిశ్రమలు, మౌలిక, పెట్టుబడుల శాఖ ముఖ్య కార్యదర్శిలను ప్రతివాదులుగా చేర్చారు. ఈ పిటిషన్ను నేడు కోర్టు విచారించే అవకాశం ఉంది.
అసలేం జరిగిందంటే.. కృష్ణపట్నం పోర్టుకు అనుబంధంగా పరిశ్రమల అభివృద్ధి కోసం 6,284 ఎకరాల భూములు ఇవ్వాలని 2007లో అప్పటి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు 2008లో ఒప్పందం జరిగింది. ఇందులో భాగంగా మొత్తం 4,731.15 ఎకరాల భూమిని రూ.65,07,97,010కి మూడు విక్రయ దస్తావేజుల ద్వారా కేపీఐపీఎల్ కొనుగోలు చేసింది. ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం.. మిగిలిన 1,298 ఎకరాల భూమిని కూడా అప్పగించాలని ఆ తర్వాత పలుమార్లు ఏపీఐఐసీని కేపీఐపీఎల్ కోరింది.
అయినా ఎటువంటి ఫలితం లేకపోగా ఈనెల 9న కేపీఐపీఎల్కు ఏపీఐఐసీ షోకాజ్ నోటీసు జారీ చేసింది. వారం రోజుల్లోగా ఆడిట్ రిపోర్టు దాఖలు చేయాలని అందులో పేర్కొంది. దీంతో స్పందించిన కేపీఐపీఎల్ కొంత గడువు కావాలని కోరుతూ తిరిగి లేఖరాసింది. అయితే, అదేమీ పట్టించుకోని ఏపీఐఐసీ.. గతంలో ప్రభుత్వం కేటాయించిన భూముల్ని రద్దు చేస్తున్నట్టు పేర్కొంటూ ఈ నెల 19న మరో లేఖ రాసింది. తమ నుంచి వివరణ తీసుకోకుండానే భూముల్ని రద్దు చేస్తున్నట్టు లేఖ పంపడాన్ని తీవ్రంగా పరిగణించిన కేపీఐపీఎల్ హైకోర్టును ఆశ్రయించింది. ఆస్తి బదలాయింపు చట్టానికి, రిజిస్ట్రేషన్ చట్ట నిబంధనలకు ఏపీఐఐసీ లేఖ విరుద్ధమని పేర్కొంటూ అది రాసిన లేఖను రద్దు చేయాలని కోర్టును అభ్యర్థించింది.