Haryana: కాసేపట్లో దుష్యంత్ మీడియా సమావేశం.. 'హర్యానాలో జేజేపీ మద్దతు ప్రకటన'పై ఉత్కంఠ
- పార్టీ ఎమ్మెల్యేలతో దుష్యంత్ చౌతాలా భేటీ
- తీహార్ జైలుకెళ్లి తన తండ్రిని కలవనున్న జేజేపీ అధినేత
- ముఖ్యమంత్రి పీఠాన్ని ఎక్కేందుకు వ్యూహాలు?
హర్యానాలో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు బీజేపీకి మద్దతు ఇవ్వబోమని ఇప్పటికే స్పష్టం చేసిన జననాయక్ జనతా పార్టీ అధినేత దుష్యంత్ చౌతాలా తమ పార్టీ నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచిన నేతలతో సమావేశమయ్యారు. ఓ కేసులో తీహార్ జైలులో శిక్ష అనుభవిస్తోన్న తన తండ్రి అజయ్ చౌతాలాను కూడా ఆయన ఈ రోజు కలవనున్నారు. ముఖ్యమంత్రి పీఠం కోసం ఆయన వ్యూహాలు పన్నుతున్నట్లు తెలుస్తోంది.
ఆ రాష్ట్రంలో 10 సీట్లతో జేజేపీని మూడో అతిపెద్ద పార్టీగా నిలిపి, కింగ్ మేకర్ గా మారిన ఆయన ఈ రోజు సాయంత్రం 4 గంటలకు మీడియా సమావేశం నిర్వహించనున్నారు. ఇందులో ఆయన చేసే ప్రకటనపై ఉత్కంఠ నెలకొంది. ఆయనను తమ వైపునకు తిప్పుకొనేందుకు కాంగ్రెస్, బీజేపీలు తీవ్ర ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి. మరోవైపు స్వతంత్రులతో కలిసి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే.