Pawan Kalyan: ఉన్న ఉద్యోగాలను తీసేసి కొత్త ఉద్యోగాలు ఇస్తారా?: పవన్ కల్యాణ్
- ఇసుక కొరతతో లక్షల మంది కార్మికులు పనులు కోల్పోయారు
- రాజధాని అమరావతిపై ప్రభుత్వం తన వైఖరిని స్పష్టం చేయాలి
- ప్రభుత్వ పాలన తీరు బాధ కలిగిస్తోంది
ఆంధ్రఫ్రదేశ్ లో ప్రభుత్వ పాలన పేలవంగా ఉందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. ఇసుక కొరత లక్షల మంది కార్మికులను పనులకు దూరం చేసిందని విచారం వ్యక్తం చేశారు. ప్రభుత్వం నూతనంగా ఉద్యోగ, ఉపాధి కల్పన చేయాలి కా నీ, ఉన్న ఉద్యోగాలను ఊడకొట్టకూడదని చెప్పారు. మంగళగిరిలో పార్టీ కార్యాలయంలో పవన్ మీడియాతో మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వ పాలనతీరును ఎండగట్టారు.
ఇసుక సరఫరా పునరుద్ధరణ జరిగేంతవరకు పోరాటం చేస్తామన్నారు. ప్రభుత్వ విధానాల వల్ల తమ కుటుంబాలు గడవడమే కష్టంగా మారిందని ఇసుక లారీల యజమానులు చెబుతున్నారని పవన్ తెలిపారు. అర్ధరాత్రి పూట ఇసుక ఆన్ లైన్ బుకింగ్ ఎందుకు అని ప్రశ్నించారు. ప్రభుత్వ పరిపాలన తీరు బాధ కలిగిస్తోందని, రాజధాని అమరావతిపై వైకాపా ప్రభుత్వం తన వైఖరిని స్పష్టం చేయాలన్నారు. అక్కడ రాజధాని కడతారా? లేదా? అన్నది ప్రజలకు తెలపాలని డిమాండ్ చేశారు.