TSRTC: ఆర్టీసీని ప్రజలకు అందుబాటులో లేకుండా చేయాలన్నదే కేసీఆర్ ఆలోచన: భట్టి విక్రమార్క
- సీఎం కేసీఆర్ పై భట్టి విమర్శలు
- కేసీఆర్ ప్రతిమాటలో అహం ధ్వనిస్తోందని వ్యాఖ్యలు
- కార్మికుల పట్ల చులకనగా వ్యవహరిస్తున్నారని మండిపాటు
తెలంగాణలో ఓవైపు ఆర్టీసీ సమ్మె కొనసాగుతుండగా, విపక్షాలు టీఆర్ఎస్ సర్కారుపైనా, సీఎం కేసీఆర్ పైనా దుమ్మెత్తిపోస్తున్నాయి. సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క కూడా సీఎం కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. ఆర్టీసీని రాష్ట్ర ప్రజలకు అందుబాటులో లేకుండా చేయాలన్నదే కేసీఆర్ ఆలోచన అని, ఆ కుట్రను కేసీఆరే బయటపెట్టుకున్నారని ఆరోపించారు.
గురువారం నాడు కేసీఆర్ మాట్లాడిన ప్రతిమాటలోనూ అహం ప్రతిధ్వనిస్తోందని, కార్మికుల బాధల పట్ల ఎంతో చులకనగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కార్మికులను పిలిచి చర్చలు జరిపేందుకు కేసీఆర్ ముందుకు రావడం లేదని, ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాల్సిన బాధ్యత ఆయనపైనే ఉందని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.