BJP: బీజేపీకి సీఎం పదవి, జేజేపీకి ఉపముఖ్యమంత్రి పదవి... హర్యానాలో కుదిరిన ఒప్పందం
- హర్యానాలో తొలగిన అనిశ్చితి
- ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ సంసిద్ధం
- స్థిరత్వం కోసమే కూటమి ఏర్పాటు చేశామన్న అమిత్ షా
హర్యానాలో అనిశ్చితి తొలగింది. సీఎం కుర్చీ ఎవరిదన్న విషయంలో స్పష్టత వచ్చింది. హర్యానాలో ప్రభుత్వ ఏర్పాటుపై బీజేపీ, జేజేపీ మధ్య ఒప్పందం కుదిరింది. బీజేపీకి సీఎం పదవి, జేజేపీకి ఉపముఖ్యమంత్రి పదవి ఇచ్చేట్టు ఇరువర్గాలు అంగీకరించాయి. ఇరు పక్షాలు రేపు రాష్ట్ర గవర్నర్ ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుపై తమ నిర్ణయాన్ని తెలియజేయనున్నాయి. దీనిపై బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పందిస్తూ, హర్యానాలో స్థిరత్వం కోసమే కూటమి ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు.
హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 90 సీట్లకు గాను బీజేపీ 40 స్థానాలు గెలిచింది. కాంగ్రెస్ కు 31 స్థానాలు రాగా, 10 స్థానాలు నెగ్గిన జన్ నాయక్ జనతా (జేజేపీ) పార్టీ కింగ్ మేకర్ గా అవతరించింది. దాంతో బీజేపీ... జేజేపీ మద్దతుతో ప్రభుత్వ ఏర్పాటుకు సంసిద్ధమైంది. కాగా, జేజేపీతో ఒప్పందం కుదరడంలో అమిత్ షా కీలకపాత్ర పోషించినట్టు తెలుస్తోంది.