BJP: దుష్యంత్ చౌతాలాపై మండిపడ్డ కాంగ్రెస్
- జేజేపీ మద్దతుతో హర్యానాలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్న బీజేపీ
- అధికార కాంక్షకు జేజేపీ పెద్ద పీట వేసిందంటూ మండిపడ్డ కాంగ్రెస్
- బీజేపీకి జేజేపీ, లోక్ దళ్ పార్టీలు తొత్తులంటూ వ్యాఖ్య
జేజేపీతో పాటు ఇండిపెండెంట్ల మద్దతుతో హర్యానాలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. నిన్న ఉదయం జేజేపీ అధినేత దుష్యంత్ చౌతాలా ఢిల్లీలో మాట్లాడుతూ, బీజేపీకి మద్దతు పలికే అవకాశమే లేదంటూ కుండ బద్దలు కొట్టారు. కానీ, సాయంత్రానికల్లా మాట మార్చేసి, బీజేపీకి మద్దతు పలుకుతున్నట్టు ప్రకటించి, అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ నేపథ్యంలో, దుష్యంత్ చౌతాలాపై కాంగ్రెస్ మండిపడింది. కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ, జేజేపీ, లోక్ దళ్ పార్టీలు ఎప్పుడూ బీజేపీ తొత్తులేనంటూ తీవ్ర వ్యాఖ్యలు చేవారు. దుష్యంత్ చౌతాలా మాట తప్పారని మండిపడ్డారు.
హర్యానాలో మనోహర్ లాల్ ఖట్టర్ ప్రభుత్వాన్ని ప్రజలు తిరస్కరించారనేది నిజమనే విషయం అందరికీ తెలుసని సూర్జేవాలా అన్నారు. బీజేపీని వ్యతిరేకించడం వల్లే జేజేపీ 10 సీట్లను గెలుచుకుందని... బీజేపీతో ఎప్పటికీ పొత్తు పెట్టుకోబోమని ఆ పార్టీ ప్రకటించిందని... ఇప్పుడు అధికార కాంక్షకే ఆ పార్టీ పెద్ద పీట వేసిందని మండిపడ్డారు. సమాజాన్ని చీల్చి అధికారంలోకి రావాలని బీజేపీ ఎప్పుడు ప్రయత్నించినా... జేజేపీ, లోక్ దళ్ పార్టీలు దానికి తొత్తులుగా నిలుస్తున్నాయని విమర్శించారు.