Kala Venkatrao: వైసీపీ ఎమ్మెల్యేలకు జగన్ మధ్యవర్తిగా వ్యవహరిస్తుండడం సిగ్గుచేటు: కళా వెంకట్రావు
- ఇసుక అంశంపై కళా స్పందన
- సీఎం జగన్ పై విమర్శలు
- కార్మికులను పట్టించుకోవడంలేదని వ్యాఖ్యలు
టీడీపీ ఏపీ అధ్యక్షుడు కిమిడి కళా వెంకట్రావు రాష్ట్రంలో తాజా పరిణామాలపై స్పందించారు. ఓవైపు రాష్ట్రంలో ఇసుక కొరత తీవ్రరూపం దాల్చి 30 లక్షల మంది కార్మికులు రోడ్డున పడితే, మరోవైపు వైసీపీ ఎమ్మెల్యేల మధ్య ఇసుక పంపకాల వివాదాలకు సీఎం జగన్ మధ్యవర్తిగా వ్యవహరిస్తుండడం సిగ్గుచేటని అన్నారు. తమ హయాంలో లారీ ఇసుక రూ.10 వేలు ఉండగా, ఇప్పుడు వైసీసీ నేతలు లారీ ఇసుకను రూ.50 వేల వరకు అమ్ముకుంటున్నారని ఆరోపించారు. ఈ సొమ్ము ఎవరి జేబుల్లోకి వెళుతోందో చెప్పాలని నిలదీశారు. వైసీపీ నేతల ఇసుక అక్రమాలకు తాపీ మేస్త్రి బలయ్యారని కళా వెంకట్రావు మండిపడ్డారు. ఇసుక కొరత తీవ్రతకు తాపీ మేస్త్రి నాగబ్రహ్మాజీ ఆత్మహత్యే నిదర్శనం అని వ్యాఖ్యానించారు. కార్మికుల కుటుంబాలు అలమటించిపోతున్నా సీఎం పట్టించుకోవడం లేదని అన్నారు.