Godavari: గోదావరి నుంచి బోటును బయటికి తీసిన డైవర్లను సన్మానించిన మంత్రి అవంతి
- గోదావరిలో బోటు ప్రమాదం
- బోటును వెలికితీసిన ధర్మాడి సత్యం బృందం
- డైవర్ల నైపుణ్యాన్ని, తెగువను ప్రశంసించిన మంత్రి
తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు వద్ద గోదావరిలో పర్యాటక బోటు మునిగిపోయిన సంగతి తెలిసిందే. అయితే ధర్మాడి సత్యం బృందం ఎంతో శ్రమించి బోటును వెలికితీసింది. ఈ వెలికితీత ప్రక్రియలో డైవర్లు ఎంతో కీలకపాత్ర పోషించారు. ఈ నేపథ్యంలో బోటును బయటికి తీసిన డైవర్లకు ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ సన్మానం చేశారు. వారి నైపుణ్యాన్ని, తెగువను కొనియాడారు. బోటు ప్రమాదంలో ఇప్పటికీ ఐదుగురి ఆచూకీ దొరకలేదని అన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాబోయే రోజుల్లో విశాఖ, భీమిలి, అరకు ఉత్సవాలు నిర్వహిస్తామని తెలియజేశారు. పర్యాటకాన్ని ప్రోత్సహించే క్రమంలో ఈ ఉత్సవాలకు రూ.2 కోట్లు కేటాయించనున్నట్టు తెలిపారు. నవంబరు 9, 10 తేదీల్లో భీమిలి ఉత్సవ్, డిసెంబరు 26, 27 తేదీల్లో విశాఖ ఉత్సవ్ నిర్వహిస్తామని వివరించారు. ఆపై వచ్చే ఏడాది ఫిబ్రవరిలో అరకు ఉత్సవాలు నిర్వహిస్తామని చెప్పారు.