Shakib Al Hasan: షకీబల్ పై చర్యలకు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు సిద్ధం!
- ఒప్పందం ఉల్లంఘించాడంటూ నోటీసులు
- చట్టపరమైన చర్యలకు సన్నద్ధం
- ప్రమాదంలో క్రికెటర్ భవితవ్యం
ఇటీవల సమ్మె చేసిన బంగ్లాదేశ్ క్రికెటర్లపై ఆ దేశ క్రికెట్ బోర్డు అదను చూసి దెబ్బకొట్టేందుకు ప్రయత్నిస్తున్నట్టు అర్థమవుతోంది. అక్టోబర్ 23న బోర్డుకు, క్రికెటర్లకు మధ్య చర్చలతో సమ్మె ముగిసినప్పటికీ, ఆ ప్రభావం ఆటగాళ్లపై పడింది. సమ్మె చేసిన క్రికెటర్లకు నేతృత్వం వహించిన స్టార్ ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్ ను బోర్డు టార్గెట్ చేసింది. షకీబ్ అక్కడి టెలికాం కంపెనీకి ప్రచారకర్తగా ఉండటంతో అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు(బీసీబీ) సన్నద్ధమైంది. షకీబ్ బోర్డుతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని ఉల్లంఘించాడని తెలిపింది.
బీసీబీ నియమావళి ప్రకారం కాంట్రాక్టు జాబితాలో ఉన్న క్రికెటర్లు టెలికాం సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకోరాదు.. ఈ నిబంధనను షకీబ్ ఉల్లంఘించాడంటూ అతని నుంచి వివరణను బీసీబీ కోరింది. ఒకవేళ షకీబ్ సంతృప్తికరంగా సమాధానం ఇవ్వకపోతే అతనిపై కఠిన చర్యలు తీసుకుంటామని బీసీబీ అధ్యక్షుడు నజముల్ హసన్ మీడియా తెలిపారు.
‘మేము చట్టపరంగా అతనిపై చర్యలు తీసుకోవాలనుకుంటున్నాము. ఇలాంటి ఉల్లంఘనలకు పాల్పడ్డ ఎవరినీ కూడా ఉపేక్షించం. షకీబ్ తోపాటు, టెలీకాం కంపెనీని కూడా నష్ట పరిహారాన్ని కోరతాం. షకీబ్ ఇచ్చిన వివరణ తర్వాతే చట్టపరమైన చర్యలుంటాయి’ అని హసన్ తెలిపారు.