Ramcharan: నాన్న నటించిన ఆ సీన్ చూసి ఏడ్చేశాను: రామ్ చరణ్
- 'రంగస్థలం' దాటి 'బాహుబలి'కి దగ్గరగా వెళ్లిన 'సైరా' కలెక్షన్లు
- క్లయిమాక్స్ సీన్ చూసి కన్నీరు ఆగలేదు
- నాన్న అన్ని సినిమాలకూ తానే నిర్మాతను కాదన్న రామ్ చరణ్
తన తండ్రి మెగాస్టార్ చిరంజీవితో 'సైరా' నిర్మించి హిట్ కొట్టిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఇప్పుడు 'ఆర్ఆర్ఆర్' షూటింగ్ లో బిజీగా ఉంటూనే, దీపావళి సందర్భంగా ఓ పత్రికకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇస్తూ, పలు విషయాలను చెప్పుకొచ్చాడు. ముఖ్యంగా 'సైరా' కలెక్షన్లను బహిరంగంగా వెల్లడించక పోవడానికి కారణం చెప్పాడు. ఈ సినిమా వసూళ్ల గురించి తాను కూడా తెలుసుకోలేదని అన్నాడు. ఈ పాత్రను చాలెంజ్ గా తీసుకుని చిరంజీవి చేశారని చెప్పుకొచ్చాడు. 'రంగస్థలం' కలెక్షన్స్ ను సినిమా దాటిందని, 'బాహుబలి'కి దగ్గరగా వెళ్లిందని అన్నాడు.
'సైరా' క్లయిమాక్స్ సీన్స్ తీసే సమయంలో తాను లేనని, తరువాత వాటిని చూసి కన్నీరు ఆగలేదని రామ్ చరణ్ వ్యాఖ్యానించాడు. ఈ సీన్లను ఎలా తీయాలా? అని రెండు నెలల పాటు ఆలోచించామని చెప్పాడు. నరసింహారెడ్డిని ఉరి తీసిన తరువాత 30 ఏళ్ల పాటు ఆ తలను కోట గుమ్మానికి వేలాడదీశారని, దాన్ని అలాగే చూపించాలా? వద్దా? అని ఎంతో ఆలోచించి, ప్రేక్షకులు బాధపడకుండా ఉండేలా కాస్తంత స్వేచ్ఛ తీసుకుని చేశామని చెప్పాడు.
తాను నిర్మాతను అవుతానని ఎన్నడూ అనుకోలేదని కొణిదెల ప్రొడక్షన్స్ నాన్న ఆలోచనల నుంచి వచ్చిందే తప్ప, తన ఆలోచన కాదని స్పష్టం చేశాడు. నిజానికి తనకు ప్రొడక్షన్ వ్యవహారాలపై ఆసక్తి లేదని, చిరంజీవి నటించే చిత్రాలకు నిర్మాతగా తాను కొనసాగాలన్న ఆలోచన కూడా లేదని చెప్పుకొచ్చాడు.