Guntur District: ఆత్మహత్య చేసుకున్న మేస్త్రీ కుటుంబానికి ఆర్థికసాయం ప్రకటించిన పవన్ కల్యాణ్
- గుంటూరు జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న నాగబ్రహ్మాజీ
- తీవ్ర విచారం వ్యక్తం చేసిన పవన్ కల్యాణ్
- ట్విట్టర్ లో ప్రగాఢ సానుభూతి
ఏపీలో ఇసుక కొరత లక్షలాదిమంది కార్మికుల పొట్ట కొడుతోందని జనసేనాని పవన్ కల్యాణ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. నిన్న గుంటూరు జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న మేస్త్రీ నాగ బ్రహ్మాజీ ఉదంతం తనను తీవ్రంగా కలచివేసిందని పవన్ ట్విట్టర్ లో పేర్కొన్నారు. నాగ బ్రహ్మాజీ కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నానని పేర్కొన్న పవన్, ఈ సందర్భంగా మేస్త్రీ కుటుంబానికి లక్ష రూపాయల ఆర్థికసాయం ప్రకటించారు.
నాగ బ్రహ్మాజీ ఆత్మహత్య ఏపీలోని భవన నిర్మాణ రంగ కార్మికుల దయనీయ స్థితికి నిదర్శనం అని ఆరోపించారు. ఏపీ ప్రభుత్వ అస్తవ్యస్త ఇసుక విధానం కారణంగా రాష్ట్రంలోని 19.6 లక్షల మంది కార్మికులు నేరుగా ప్రభావితం కాగా, మరో 10 లక్షల మంది పరోక్షంగా ఉపాధి కోల్పోయారని పవన్ తెలిపారు. పనిలేని కార్మికుల కుటుంబాలు ఇప్పుడేం చేయాలో తెలియని స్థితిలో పడిపోయారని విమర్శించారు.