Narendra Modi: మోదీ విమానానికి అనుమతి నిరాకరణపై ఐసీఏవోకు ఫిర్యాదు చేయనున్న భారత్
- పాకిస్థాన్ చేసిన ప్రకటన పట్ల చింతిస్తున్నాం
- ఐసీఏవో నిబంధనలు ప్రతిదేశం పాటించాల్సి ఉంటుంది
- మీడియాకు తెలిపిన భారత అధికారి
భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రయాణించే విమానం తమ గగనతలంపై నుంచి వెళ్లేందుకు పాకిస్థాన్ మరోసారి అనుమతిని నిరాకరించిన విషయం తెలిసిందే. మోదీ సౌదీ అరేబియా పర్యటనకు వెళ్లాల్సి ఉండగా పాక్ ఈ చర్యకు పాల్పడింది. దీనిపై భారత్ స్పందించింది. అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ (ఐసీఏవో) దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లాలని భావిస్తోంది. పాకిస్థాన్ చేసిన ప్రకటన పట్ల చింతిస్తున్నామని, ఐసీఏవో నిబంధనలు ప్రతిదేశం పాటించాల్సి ఉంటుందని ఓ భారత అధికారి మీడియాకు తెలిపారు.
ఈ విషయంపై భారత్ ఇప్పటికి రెండుసార్లు సంయమనం పాటించిందని అన్నారు. ఇక తాము ఈ విషయంపై కచ్చితంగా ఐసీఏవోకు ఫిర్యాదు చేయాల్సిందేనని స్పష్టంచేశారు. వ్యక్తిగత సాకులను చూపుతూ ఇష్టానుసారం నడుచుకుంటే ఐసీఏవో తగిన బుద్ధి చెబుతుందని వ్యాఖ్యానించారు. కాగా జమ్మూకశ్మీర్ లో భారత్ మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతోందని, అందుకే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని పాక్ విదేశాంగ మంత్రి ఖురేషి చెప్పుకొచ్చారు.