virendra sehwag: నేను చెప్పాను చూస్కోండి.. గంగూలీ ముఖ్యమంత్రి అవుతాడు: సెహ్వాగ్
- గంగూలీ బీసీసీఐ చీఫ్ అవుతాడని 2007లోనే చెప్పా
- నాడు నేను చెప్పిన దానిని అందరూ అంగీకరించారు
- దాదా ఏనాటికైనా బెంగాల్ ముఖ్యమంత్రి కూడా అవుతాడు
టీమిండియా మాజీ సారథి సౌరవ్ గంగూలీ బీసీసీఐ చీఫ్ అవుతాడని తాను ఏనాడో ఊహించి చెప్పానని, అది నేడు నిజమైందని డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ పేర్కొన్నాడు. భవిష్యత్తులో గంగూలీ బెంగాల్ ముఖ్యమంత్రి కూడా అవుతాడని భవిష్యవాణి చెప్పాడు. తాను చెప్పింది ఒకటి నిజమైందని, ఇంకోటి కూడా నిజమవుతుందని అన్నాడు. బీసీసీఐ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన గంగూలీ ఈ నెల 23న బాధ్యతలు చేపట్టాడు.
ఈ సందర్భంగా సెహ్వాగ్ మాట్లాడుతూ.. 2007లో జరిగిన ఓ ఘటనను గుర్తు చేసుకున్నాడు. కేప్‌టౌన్‌లో జరుగుతున్న టెస్టులో తాను, వసీంజాఫర్ త్వరగా అవుటయ్యామని, టెండూల్కర్ బ్యాటింగ్‌కు వెళ్లే పరిస్థితి లేకపోవడంతో గంగూలీ బ్యాటింగ్‌కు దిగినట్టు సెహ్వాగ్ గుర్తు చేసుకున్నాడు. ఆ మ్యాచ్‌లో దాదా అద్భుతంగా ఆడాడని పేర్కొన్నాడు. డ్రెస్సింగ్ రూములో మాటల మధ్యలో మనలో ఎవరికైనా బీసీసీఐ అధ్యక్షుడిగా ఎన్నికయ్యే అర్హత ఉందంటే అది ఒక్క గంగూలీకేనని చెప్పానని, తన మాటలను అందరూ అంగీకరించారని పేర్కొన్నాడు. ఇప్పుడు ఆ మాట నిజమైందన్నారు. అలాగే, గంగూలీ ఏనాటికైనా పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి అవుతాడని సెహ్వాగ్ పేర్కొన్నాడు. తన మాట తప్పదని, జరిగి తీరుతుందని తేల్చి చెప్పాడు.