Sanjay Raut: మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు శివసేనకు ఇతర మార్గాలూ ఉన్నాయి: సంజయ్ రౌత్
- కానీ మేము ఇతర ప్రత్యామ్నాయల వైపు చూడబోము
- మహారాష్ట్రలో దుష్యంత్ వంటి వ్యక్తులు లేరు
- బీజేపీతో శరద్ పవార్ ఎన్నడూ కలవబోరు
మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు ఆలస్యం అవుతోన్న విషయంపై శివసేన నేత సంజయ్ రౌత్ స్పందించారు. ఈ రోజు ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... 'మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేసే విషయంలో శివసేనకు ఇతర మార్గాలు కూడా ఉన్నాయని, కానీ, ఇతర ప్రత్యామ్నాయాలను చూసుకొనే తప్పుడు పనుల్ని చేయబోమని మా పార్టీ అధినేత ఉద్ధవ్ ఠాక్రే చెప్పారు. శివసేన ఎల్లప్పుడూ సత్యంతో కూడిన రాజకీయాలనే చేస్తుంది. మాకు అధికార దాహం లేదు' అని సంజయ్ రౌత్ తెలిపారు.
మహారాష్ట్రలో ఎన్నికల ముందే బీజేపీతో పొత్తు పెట్టుకొని పోటీ చేసినప్పటికీ ప్రభుత్వ ఏర్పాటు విషయంలో ఎందుకు ఆలస్యం అవుతుందన్న అంశంపై సంజయ్ రౌత్ స్పందించారు. 'మహారాష్ట్రలో దుష్యంత్ (హర్యానా నేత) వంటి వ్యక్తులు లేరు. అక్కడ ఆయన తండ్రి జైలులో ఉన్న విషయం తెలిసిందే. ఇక్కడ ధర్మం, సత్యం ఆధారంగా రాజకీయాలు చేస్తాం. ఎన్సీపీ అధినేత శదర్ పవార్ రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ కి వ్యతిరేకంగా వాతావరణాన్ని సృష్టించారు. ఆయన బీజేపీతో ఎన్నడూ కలవబోరు' అని వ్యాఖ్యానించారు.