RTC Strike: ఆర్టీసీ సమ్మె వ్యవహారం.. అధికారులతో కేసీఆర్ అత్యవసర సమావేశం
- నేడు ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు మరోసారి విచారణ
- కోర్టుకు అందించాల్సిన నివేదికపై సీఎం దిశానిర్దేశం
- భేటీకి హాజరైన పువ్వాడ, అడ్వొకేట్ జనరల్, కీలక అధికారులు
తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె తీవ్ర రూపం దాల్చింది. అధికారులతో యూనియన్ నేతలు జరిపిన చర్చలు కూడా విఫలమయ్యాయి. ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయాల్సిందేనని కార్మికులు పట్టుబడుతుండగా... ప్రభుత్వం ససేమిరా అంటోంది. ఈ నేపథ్యంలో ఈ మధ్యాహ్నం ఆర్టీసీ సమ్మె వ్యవహారంపై హైకోర్టులో మరోసారి విచారణ జరగనుంది. దీంతో, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్ లో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ భేటీకి రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్, అడ్వొకేట్ జనరల్, కీలక అధికారులు హాజరయ్యారు. కోర్టుకు అందించాల్సిన నివేదికపై వీరికి ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేస్తున్నారు. ఈ సమావేశంలో చర్చించిన అంశాలను హైకోర్టుకు అడ్వొకేట్ జనరల్ వినిపించనున్నారు.