Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీపై కేసు పెట్టడం కాదు.. ఎస్సై, ఎమ్మార్వోను అరెస్ట్ చేయాలి: చంద్రబాబు
- వంశీపై తప్పుడు కేసు పెట్టారు
- ఎమ్మార్వో, ఎస్సైలను అరెస్ట్ చేయాలి
- కోడి కత్తి కేసు ఏమైంది?
గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రాజీనామాపై టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి స్పందించారు. టీడీపీ నేతల ఆర్థిక మూలాలను దెబ్బతీసేందుకు వైసీపీ ప్రభుత్వం యత్నిస్తోందని ఆయన మండిపడ్డారు. పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయకుండా చేసేందుకు... సరెండర్ పాలిటిక్స్ కు పాల్పడుతున్నారని విమర్శించారు. వంశీని లొంగదీసుకునేందుకే తప్పుడు కేసు పెట్టారని అన్నారు. వైసీపీ ప్రభుత్వ వేధింపులపై పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. వంశీపై కేసు పెట్టడం కాదు... ఎమ్మార్వో, ఎస్సైలను అరెస్ట్ చేయాలని అన్నారు. కృష్ణా జిల్లా పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
కోడి కత్తి కేసు ఏమైందని చంద్రబాబు ప్రశ్నించారు. సొంత బాబాయి వైయస్ వివేకా హత్య కేసును ఇంత వరకు తేల్చలేకపోయారని ఎద్దేవా చేశారు. టీడీపీ హయాంలో జరిగిన అభివృద్ధి పనులన్నింటినీ రివర్స్ టెండరింగ్ చేస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ చేస్తున్నది రివర్స్ టెండరింగ్ కాదని... అది రిజర్వ్ టెండరింగ్ అని విమర్శించారు.