Bangladesh: అనుకున్నదే అయింది... బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబల్ పై ఐసీసీ వేటు
- రెండేళ్ల నిషేధం విధించిన అంతర్జాతీయ క్రికెట్ మండలి
- బుకీల సమాచారం అధికారులకు తెలపని షకీబల్
- బంగ్లాదేశ్ జట్టుపై ప్రభావం పడే అవకాశం
ప్రపంచ క్రికెట్ ను అవినీతి రహితం చేయాలని కంకణం కట్టుకున్న ఐసీసీ అందుకు అనుగుణంగా కఠిన చర్యలు తీసుకుంటోంది. అనేక పర్యాయాలు బుకీలు సంప్రదించినా ఆ విషయాన్ని అధికారులకు తెలియజేయని బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్ షకీబల్ హసన్ పై రెండేళ్ల నిషేధం విధించింది. ఐసీసీ అవినీతి నిరోధక విభాగం విచారణలో షకీబల్ తనను బుకీలు కలిసిన విషయం అంగీకరించడంతో అతడిపై చర్యలు తీసుకుంది. నిషేధ కాలంలో షకీబల్ ప్రవర్తన ఆకట్టుకునే విధంగా ఉంటే వచ్చే ఏడాది అక్టోబరులోనే మళ్లీ ఆడేందుకు అనుమతిస్తారు.
దీనిపై షకీబల్ స్పందించాడు. క్రికెట్ ను ఎంతో ప్రేమించే తాను కొన్ని తప్పులు చేశానని, వాటిని ఐసీసీ ఎదుట ఒప్పుకున్నానని వెల్లడించాడు. తనలా యువకులు ఎవరూ చేయవద్దని సూచించాడు. కాగా, షకీబల్ ప్రస్తుతం బంగ్లాదేశ్ టి20, టెస్టు జట్లకు కెప్టెన్ గా ఉన్నాడు. నవంబర్ 3 నుంచి బంగ్లా జట్టు భారత్ లో పర్యటించనున్న నేపథ్యంలో ప్రధాన ఆటగాడు లేకుండా బరిలో దిగడం బంగ్లాదేశ్ విజయావకాశాలపై పెను ప్రభావం చూపనుంది.