Ram Madhav: జగన్ ప్రభుత్వానికి సహకరించేందుకు సిద్ధం: బీజేపీ నేత రామ్ మాధవ్
- ప్రభుత్వ పథకాలు పేదలకు అందేలా చూస్తాం
- నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరిస్తాం
- క్షేత్ర స్థాయిలో బలపడాలన్నదే వ్యూహమన్న రామ్ మాధవ్
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో నడుస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పూర్తిగా సహకరిస్తామని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ వ్యాఖ్యానించారు. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన, ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందేలా చూస్తామని, కేంద్రం అందిస్తున్న సంక్షేమం పేదలకు అందుతుందో లేదో ఓ కన్నేసి ఉంచుతామని అన్నారు. రాష్ట్రంలో నిర్మాణాత్మక ప్రతిపక్షంలా వ్యవహరిస్తూ, క్షేత్ర స్థాయిలో బలపడాలన్న తమ వ్యూహాలను అమలు చేస్తామని తెలిపారు.
తెలుగుదేశం పార్టీ నుంచి వలసలను నివారించేందుకే, చంద్రబాబునాయుడు ఇప్పుడు తిరిగి బీజేపీతో పొత్తు అంశాన్ని తెరపైకి తెచ్చారని రామ్ మాధవ్ ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ లో బీజేపీకి ఎవరితోనూ పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించిన ఆయన, వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని మరోసారి తేల్చి చెప్పారు. ఏ పార్టీకీ జూనియర్ గా వ్యవహరించాల్సిన అగత్యం బీజేపీకి పట్టలేదన్నారు.