Kunamneni: కూనంనేనికి ఏదైనా జరిగితే ప్రభుత్వం బాధ్యత వహించాలి: సీపీఐ నేత చాడ వెంకటరెడ్డి
- ఆస్పత్రిలో దీక్ష కొనసాగిస్తోన్న కూనంనేని
- కేసీఆర్ తలచుకుంటే సమస్యకు గంటలో పరిష్కారం లభిస్తుంది
- కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా పట్టించుకోవడంలేదు
తెలంగాణలో సమ్మె బాట పట్టిన ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా దీక్ష చేస్తున్న కూనంనేని సాంబశివరావు ఆరోగ్య పరిస్థితి దిగజారిపోతోందని సీపీఐ నేత చాడ వెంకటరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. దీక్షకు దిగిన కూనంనేనిని పోలీసులు అరెస్టు చేసి నిమ్స్ లో చేర్చిన విషయం తెలిసిందే.
చికిత్సకు నిరాకరిస్తూ కూనంనేని ఆస్పత్రిలో కూడా తన దీక్షను విడువలేదు. దీంతో ఆయన ఆరోగ్యం క్షీణిస్తోందని సీపీఐ నేత చాడ వెంకటరెడ్డి అన్నారు. ఈ రోజు చాడ వెంకటరెడ్డి కూనంనేనిని పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. కార్మికుల డిమాండ్ల పట్ల ప్రభుత్వం మొండిగా వ్యవహరించడం తగదని ఆయన చెప్పారు. కేసీఆర్ తలచుకుంటే సమస్యకు గంటలో పరిష్కారం లభిస్తుందన్నారు. కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా కేసీఆర్ పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. కూనంనేనిని పరామర్శించిన ఇతర నేతల్లో ప్రొఫెసర్ కోదండరాం, వీహెచ్, ఎల్.రమణ, రావుల తదితరులున్నారు.