India: ఆస్ట్రేలియా పర్యటనలో భారత్ 'డే అండ్ నైట్' టెస్ట్ ఆడాలి: ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్
- గత పర్యటనలో భారత్ నిరాకరించింది
- ఇప్పుడు బంగ్లాతో తన తొలి డే అండ్ నైట్ టెస్ట్ మ్యాచ్ కు ఒప్పుకుంది
- షకిబల్ పై రెండేళ్ల నిషేధం చాలదు
భారత్ తొలిసారిగా డే అండ్ నైట్ టెస్ట్ మ్యాచ్ ఆడనున్న నేపథ్యంలో ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ స్పందిస్తూ.. ‘గతంలో భారత్ ఆస్ట్రేలియా పర్యటనలో డే అండ్ నైట్ టెస్ట్ మ్యాచ్ ఆడడానికి నిరాకరించింది. ఇప్పుడు స్వదేశంలో బంగ్లాతో తన తొలి డే అండ్ నైట్ టెస్ట్ ను ఆడేందుకు ఒప్పుకుంది. అలాగే వచ్చే ఏడాది ఆస్ట్రేలియా పర్యటనలో భారత్ ఒకటి లేదా రెండు డే అండ్ నైట్ మ్యాచ్ లు ఆడేందుకు అంగీకరిస్తుందనుకుంటా’ అని ట్వీట్ చేశాడు.
టెస్ట్ హోదా ఉన్న భారత్, బంగ్లా జట్లు మినహా, మిగతా జట్లన్నీ పింక్ బంతితో సాగే డే అండ్ నైట్ మ్యాచ్ లు ఆడాయి. భారత్ పలు కారణాలు చెబుతూ ఈ మ్యాచ్ లకు దూరంగా ఉంది. ఇటీవల బీసీసీఐ కొత్త అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన సౌరవ్ గంగూలీ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుతో సంప్రదించి కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా నవంబర్ 22 నుంచి 26 వరకు జరిగే రెండో టెస్ట్ డే అండ్ నైట్ గా ఆడాలని కోరాడు. ఇక బీసీబీ తమ జట్టుతో సంప్రదించి నిన్ననే ఓకే చెప్పిన విషయం తెలిసిందే.
షకిబల్ పై రెండేళ్ల నిషేధం చాలదు:
బంగ్లాదేశ్ క్రికెటర్ షకిబల్ హసన్ పై ఐసీసీ విధించిన రెండేళ్ల నిషేధం సరిపోదని వాన్ పేర్కొన్నాడు. ప్రస్తుత తరం క్రికెటర్లకు ఏం చేయాలో, ఏం చేయకూడదో బాగా తెలుసు. బుకీ తనను సంప్రదిస్తే ఈ విషయం ఐసీసీకి తెలిపాల్సి ఉంటుంది. ఈ చిన్న విషయం తెలియదా? అని ప్రశ్నించాడు. అతనికి రెండేళ్ల శిక్ష సరిపోదని, శిక్షా సమయం పెంచాలని పేర్కొన్నాడు.