Gold: నల్లధనాన్ని 'బంగారం'లా దాస్తున్న వారిపై కేంద్రం దృష్టి.. త్వరలో ప్రత్యేక పథకం?
- పరిమితికి మించిన బంగారం కలిగివుంటే వెల్లడికి అవకాశం
- రశీదు లేకుండా కొనుగోలు చేసిన బంగారంపై కూడా పన్ను
- ఈ క్షమాభిక్ష పథకం నిర్ణీత కాలానికే వర్తింపు
దేశంలో నల్లధనం నిర్మూలనకు మూడేళ్ల క్రితం పెద్ద నోట్లయిన వెయ్యి, ఐదువందల డినామినేషన్లను రద్దు చేసి సంచలన నిర్ణయం తీసుకున్నమోదీ ప్రభుత్వం తాజాగా నల్ల ధనాన్ని బంగారం రూపంలో దాచిపెట్టిన వారిపై దృష్టి పెట్టింది. పరిమితికి మించిన బంగారం కలిగివున్న వారిని లక్ష్యం చేసుకొని, నిర్ణీత కాలపరిమితికి లోబడి ఓ పథకాన్ని ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఆమ్నెస్టీ (క్షమాభిక్ష) పథకాన్ని ప్రవేశపెట్టడానికి సన్నాహాలు చేస్తోంది.
ఈ పథకం ప్రకారం, నిర్ణీత కాలంలో పరిమితికి మించి బంగారం ఉన్నవారు ప్రభుత్వం నిర్దేశించిన పన్ను చెల్లించాల్సి ఉంటుంది. కాల పరిమితి ముగిసిన తర్వాత దాడులలో కనుక బంగారం దొరికితే భారీ జరిమానా కూడా చెల్లించాల్సి ఉంటుంది. ఎంత పరిమితి మేరకు ఒక కుటుంబం, వ్యక్తి తమ వద్ద పసిడిని ఉంచుకోవచ్చన్న అంశాలపై ఇంకా ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు. వివాహమైన మహిళలు కలిగివుండే బంగారంపై ప్రస్తుతమున్న పరిమితిని పెంచేందుకు అవకాశముంది.
ఈ పథకం అమల్లోకి వస్తే.. ప్రతీ కుటుంబం లేదా వ్యక్తులు తమ వద్ద ఉన్న బంగారం విలువను ప్రభుత్వానికి తెలపాల్సి ఉంటుంది. ఆర్థిక వ్యవహారాల మంత్రిత్వశాఖ, రెవెన్యూశాఖ కలిసి ఈ పథకాన్ని రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది. కాగా ఈ పథకం ప్రతిపాదనను కేంద్ర కేబినెట్ ముందు పెట్టినట్లు సమాచారం. ఈ నెల రెండో వారంలోనే దీనిపై చర్చించాల్సి ఉన్నప్పటికీ, హర్యానా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వం దీనిని వ్యూహాత్మకంగా వాయిదా వేసినట్లు తెలుస్తోంది. మరోవైపు దేవాలయాల్లోని బంగారాన్ని ఉత్పాదక పెట్టుబడుల్లోకి మరలించేందుకు కేంద్రం యోచిస్తున్నట్లు సమాచారం.