Crime News: అమ్మో, సైబర్ నేరగాళ్లు.. ‘లింక్’పెట్టి మోసం చేస్తారు!
- బ్యాంక్, కొరియర్ సంస్థల పేరుతో ఖాతాదారులకు ఫోన్లు
- చిన్నమొత్తం చెల్లించాల్సి ఉందంటూ సెల్‌ఫోన్‌కు లింక్
- క్లిక్ చేసిన కాసేపటికే ఖాతాలో డబ్బు మాయం
సైబర్ నేరగాళ్లు ఎప్పటికప్పుడు కొత్త మార్గాలు వెతుకుతూనే ఉంటారు. ఇటీవల కాలంలో సైబర్ మోసాలపై ప్రజల్లో అంతో ఇంతో అవగాహన పెరుగుతుండడంతో పాతమార్గాలను వదిలేసి కొత్తమార్గాల్లో మోసాలకు తెరతీస్తున్నారు నేరగాళ్లు. తాజాగా తాము బ్యాంకు అధికారులమనో, కొరియర్ సర్వీస్ నుంచో అని చెప్పి ఖాతాదారులకు వల విసురుతున్నారు. చిన్నమొత్తం చెల్లించాలంటూ ఓ లింక్ పంపుతున్నారు. పొరపాటున ఆ లింక్‌పై క్లిక్ చేశామో మన ఖాతా ఖాళీ అయినట్టే. ఇందుకు నిదర్శనం ఈ ఘటన..
గుంటూరు జిల్లా మంగళగిరి మండలం పెదవడ్లపూడికి చెందిన అర్జునరావుకు రెండు రోజుల క్రితం ఓ ఫోన్ వచ్చింది. ‘మేము కొరియర్ సంస్థ నుంచి మాట్లాడుతున్నాం. మీకు ఒక పార్శిల్ వచ్చింది. డెలివరీ చార్జిగా మీరు రూ.11 చెల్లించాలి. మీ సెల్‌ఫోన్‌కు ఓ సంక్షిప్త సందేశం పంపిస్తాం. దానిద్వారా మీ బ్యాంక్ ఖాతా నుంచి డబ్బు పంపిస్తే మీ పార్శిల్ మీకు అందజేస్తాం’ అన్నది ఆ ఫోన్ సమాచారం.
చిన్న మొత్తమే కదా అన్న ఉద్దేశంతో అర్జునరావు తన సెల్‌ఫోన్‌కు వచ్చిన మెసేజ్‌లో లింక్‌పై క్లిక్ చేసి, తన ఖాతా నుంచి రూ.11 పంపారు. ఆ తర్వాత కాసేపటికి అతని బ్యాంక్ ఖాతా నుంచి రూ.70 వేలు మాయమయ్యాయి. ఏం జరిగిందో అర్థంకాని అర్జునరావు తనకు వచ్చిన ఫోన్ నంబర్‌కు తిరిగి ఫోన్ చేస్తే అది పనిచేయలేదు. దీంతో నిన్న పోలీసులను ఆశ్రయించారు.