isis: బగ్దాదీ అండర్ వేర్ ను అమెరికా సైన్యానికి ఇచ్చిన వ్యక్తికి రూ.177 కోట్ల బహుమతి!
- బగ్దాదీ ఆచూకీ తెలిపిన వారికి 25 మిలియన్ డాలర్ల రివార్డు
- గతంలో ప్రకటించిన అమెరికా
- ఆ వ్యక్తి ఇచ్చిన బగ్దాది లోదుస్తుల సాయంతోనే అమెరికా ఆపరేషన్
ప్రపంచానికి పెను ముప్పులా మారిన ఉగ్రవాద సంస్థ ఐసిస్ అధినేత అబూబకర్ అల్ బగ్దాదీని ఇటీవల అమెరికా సైన్యం హతమార్చిన విషయం తెలిసిందే. ఐసిస్ ఉగ్రవాదిగా అండర్ కవర్ ఏజంట్ గా ఉన్న ఓ వ్యక్తి ఈ దాడికి ముందు అల్ బగ్దాదీకి చెందిన అండర్ వేర్ లను దొంగిలించి వాటిని యూఎస్ సైన్యానికి అప్పగించిన విషయం కూడా ఇప్పటికే వెల్లడైంది. ఆ వ్యక్తికి 25 మిలియన్ డాలర్ల (రూ.177 కోట్లు) నగదు బహుమతి దక్కే అవకాశం ఉంది.
ఎందుకంటే బగ్దాదీ ఆచూకీ తెలిపిన వారికి నగదు బహుమతి ఇస్తామని అమెరికా గతంలో ప్రకటించింది. అండర్ కవర్ ఏజంట్ గా ఉన్న వ్యక్తి ఇచ్చిన బగ్దాది లోదుస్తుల సాయంతో పలు పరీక్షలు చేసిన యూఎస్ అధికారులు అక్కడ ఉన్నది బగ్దాదీయే అన్న విషయాన్ని నిర్ధారించినట్లు తెలుస్తోంది. ఈ లోదుస్తులతో పాటు ఇతర సమాచారం అందించిన ఆ వ్యక్తి సున్నీ అరబ్ అని ఓ అధికారి చెప్పారు. తన కుటుంబ సభ్యుల్లో ఒకరిని ఐసిస్ ఉగ్రవాదులు గతంలో చంపేశారు. దీంతో ప్రతీకారంతో అతడు ఈ పని చేసినట్లు సమాచారం.