Nara Lokesh: దీనికంతటికీ కారకుడు సజ్జల రామకృష్ణారెడ్డి: నారా లోకేశ్ ఆరోపణలు
- టీడీపీ శ్రేణులపై కేసులు పెట్టడమే ఆయన లక్ష్యమని లోకేశ్ వ్యాఖ్యలు
- డీజీపీ, ఎస్పీలకు కేసులు పెట్టాలని సూచించేది సజ్జలేనని వెల్లడి
- హోంమంత్రికి పెద్దగా అధికారం లేదన్న లోకేశ్
వైసీపీ ప్రభుత్వం వచ్చి ఐదు నెలలైందని, అయితే ప్రజాపాలన పక్కనపెట్టి టీడీపీ కార్యకర్తలను, నాయకులను వేధించడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. దీనికంతటికీ కారకుడు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అని లోకేశ్ ఆరోపించారు. ప్రజల వద్ద నుంచి నెలకు రూ.3.85 లక్షల జీతం అందుకుంటూ టీడీపీ నేతలపైనా, కార్యకర్తలపైనా కేసులు పెట్టడమే లక్ష్యంగా ఆయన పనిచేస్తున్నారని విమర్శించారు. పాపం హోంమంత్రి గారికి పెద్దగా అధికారం లేదని, సజ్జల రామకృష్ణారెడ్డే నేరుగా డీజీపీ, ఎస్పీలతో మాట్లాడుతూ తాను చెప్పిన నేతలపై కేసులు పెట్టాలని సూచిస్తుంటాడని తెలిపారు. విజయవాడలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆయనీ వ్యాఖ్యలు చేశారు.
రూ.42 వేల కోట్లు దోచుకున్నాడని సీబీఐ, ఈడీ అభియోగాలు ఎదుర్కొంటూ 16 నెలలు జైలులో ఉండొచ్చని వ్యక్తి పాలనలో ఇవాళ శాంతిభద్రతలు లేకుండా పోయాయని అన్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక టీడీపీ శ్రేణులపై 610 దొంగ కేసులు బనాయించారని లోకేశ్ ఆరోపించారు.
పాతపట్నం మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ గారు డౌన్ డౌన్ సీఎం అన్నారని ఆయనపైనా కేసు పెట్టారని మండిపడ్డారు. గతంలో ఇదే జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిని కాల్చి చంపాలని వ్యాఖ్యలు చేసినప్పుడు తాము ప్రజాస్వామ్య స్ఫూర్తితో వ్యవహరించామని లోకేశ్ గుర్తుచేశారు. ఇప్పుడు వల్లభనేని వంశీ పైనా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.