NIA: తమిళనాడులో మరోసారి ఎన్ఐఏ సోదాలు... ఐసిస్ కుట్రలపై సమాచారం!
- దాడులకు ఐసిస్ పన్నాగాలు
- గతేడాది అరెస్ట్ చేసిన నిందితుడి నుంచి కీలక సమాచారం
- అనేక పట్టణాల్లో ఎన్ఐఏ సోదాలు
దక్షిణాది రాష్ట్రం తమిళనాడుపై కరుడుగట్టిన ఉగ్రవాద సంస్థ ఐసిస్ కన్ను పడిందని, రాష్ట్రంలో దాడులకు కుట్ర పన్నిందని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) చెబుతోంది. ఈ క్రమంలో కోయంబత్తూరు, నాగపట్నం, శివగంగ, తూత్తుకుడి, తిరుచ్చి ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. ఈ సందర్భంగా ఎన్ఐఏ అధికారులు రెండు ల్యాప్ టాప్ లు, కొన్ని డాక్యుమెంట్లు, 8 మొబైల్ ఫోన్లు, 5 సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. హిందుత్వ వాదులే లక్ష్యంగా ఐసిస్ దాడులకు కుట్ర పన్నుతోందని ఓ నిందితుడ్ని విచారించిన సమయంలో ఎన్ఐఏ అధికారులు తెలుసుకున్నారు.
గతేడాది తమిళనాడులో ఓ అనుమానితుడ్ని అరెస్ట్ చేసిన పోలీసులు విచారణలో కీలక సమాచారం రాబట్టారు. ఈ సమాచారం ఆధారంగానే తాజాగా ఎన్ఐఏ 6 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. ఎన్ఐఏ గతంలోనూ పలుమార్లు సోదాలు చేపట్టింది. 2018లో తమిళనాడులో జరిగిన ఓ దాడికి సంబంధించి తదుపరి దర్యాప్తులో భాగంగానే ఈ సోదాలు నిర్వహించినట్టు తెలుస్తోంది.