shiv sena: మహారాష్ట్రకు శివసేన నుంచే ముఖ్యమంత్రి: సంజయ్ రౌత్
- ప్రభుత్వ ఏర్పాటుపై శివసేన, బీజేపీ మధ్య చర్చలు జరగడం లేదు
- బీజేపీకి మేము ఎటువంటి అల్టిమేటమూ జారీ చేయం
- '50-50' ప్రకారం ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ప్రజలు తీర్పునిచ్చారు
మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై శివసేన, బీజేపీ మధ్య ప్రస్తుతం చర్చలు జరగడం లేదని శివసేన నేత సంజయ్ రౌత్ తెలిపారు. శివసేనకు చెందిన వ్యక్తే మహారాష్ట్రకు సీఎం అవుతారని వ్యాఖ్యానించారు. మహారాష్ట్రలో సీఎం పదవీకాలాన్ని చెరిసగం పంచుకోవాలంటూ డిమాండ్ పెట్టిన శివసేన.. తన పట్టు వీడడం లేదన్న విషయం తెలిసిందే. వర్లి నుంచి పోటీ చేసి గెలిచిన ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రేకు సీఎం పదవి ఇవ్వాలని ఆ పార్టీ కోరుతోంది.
ఈ రోజు సంజయ్ రౌత్ ఈ విషయంపై ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. 'బీజేపీకి మేము ఎటువంటి అల్టిమేటమూ జారీ చేయాలని అనుకోవట్లేదు. ఆ పార్టీ వారు గొప్ప నేతలు. ఒకవేళ శివసేన ఇతర పార్టీలతో కలిసి రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంటే స్థిరమైన సర్కారు ఏర్పాటు చేసేందుకు కావాల్సినంత మంది ఎమ్మెల్యేల మద్దతు లభిస్తుంది. కానీ, రాష్ట్రంలో 50-50 ఫార్ములా ప్రకారం ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ప్రజలు తీర్పునిచ్చారు. అలాగే, వారు శివసేన నేతే సీఎం కావాలని కోరుకుంటున్నారు. మేము రైతుల కష్టాలను వివరించి చెప్పేందుకే గవర్నర్ ను కలుస్తున్నాం. ఇందులో మరే ఉద్దేశం లేదు' అని వ్యాఖ్యానించారు.