Chidambaram: చిదంబరంకు బెయిల్ నిరాకరించిన ఢిల్లీ హైకోర్టు
- ఆయన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని న్యాయస్థానం వ్యాఖ్యలు
- ఎయిమ్స్ బోర్డు నివేదిక ఆధారంగా కోర్టు నిర్ణయం
- ఆరోగ్య పరిరక్షణకు చర్యలు తీసుకోండంటూ జైలు అధికారులకు ఆదేశం
ఐఎన్ ఎక్స్ మీడియా కేసులో అరెస్టై విచారణ ఎదుర్కొంటున్న కేంద్ర మాజీ ఆర్థికమంత్రి చిదంబరంకు ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురయింది. తన ఆరోగ్యం బాగాలేదంటూ చిదంబరం పెట్టుకున్న మధ్యంతర బెయిల్ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. ఎయిమ్స్ మెడికల్ బోర్డు ఆయన ఆరోగ్యం సంతృప్తికరంగా ఉందని నివేదిక సమర్పించడంతో కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది.
మరోవైపు, చిదంబరం ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని తీహార్ జైలు అధికారులను కోర్టు ఆదేశించింది. మెడికల్ బోర్డు సూచన మేరకు ఆయనకు ఇంటి నుంచి భోజనం, మినరల్ వాటర్ సమకూర్చాలని, దోమల నుంచి రక్షణ కల్పించాలని సూచించింది. ఇదే కేసులో చిదంబరం దాఖలు చేసుకున్న ప్రధాన బెయిల్ పిటిషన్ ఈ నెల 4న విచారణకు రానుంది. సీబీఐ కేసులో ఆయన ఇప్పటికే బెయిల్ పొందారు.